Nov 19,2020 20:14

భోపాల్‌ : ప్రజలకు పోలీసులు చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవి. కరోనా కారణంగా వారి సేవలు ప్రజలకు ఇంకా దగ్గరయ్యాయనే చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు ఆయా సందర్భానికి తగ్గట్టుగా ప్రవర్తించడంతో పాటు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సాయమందించడంలో ముందుంటారు. అటువంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఓ వృద్ధ మహిళకు గాయాలై నడవలేని పరిస్థితి ఉంటే.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ భుజంపై మోసుకెళ్లి.. ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ... ఆ అధికారిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఓ మినీ బస్సులో 35 మంది కార్మికులు ప్రయాణిస్తున్న బస్సు జబల్‌పూర్‌ జిల్లాలో బోల్తాపడింది. ఆ సంఘటన జరిగిన వెంటనే హుటాహుటిన పోలీసులు అక్కడికి వెళ్లి.. గాయాలైన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయాలపాలైన మహిళను... అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంతోష్‌ సేన్‌...తన భుంజపైనే ఆమెను మోసుకొని ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు. గతంలో సంతోష్‌ సేన్‌కు కుడిభుజంకి బుల్లెట్‌ గాయమైంది. ఆమెను భుజంపై మోస్తున్న సమయంలో భుజం నొప్పివచ్చినప్పటికీ.. అయినా విధి నిర్వహణలో ఇవేవీ పట్టించుకోకుండా... బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిర్వహించారు. ఈ విషయం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దృష్టికి వెళ్లింది. దీంతో సంతోష్‌ను ఆయన ప్రశంసించారు. అలాగే ఐజి భగత్‌సింగ్‌ చౌహాన్‌ ...సహాయక కార్యకలాపాల్లో పాల్గన్న పోలీస్‌ సిబ్బందికి ప్రశంసా పత్రంతోపాటు, వెయ్యిరూపాయలను బహుమతిగా అందించారు. కాగా, 'బస్సు ప్రమాదంలో గాయాలైన 35 మందిలో ఏ ఒక్కరికీ తీవ్ర గాయాలవకుండా కాపాడడంలో పోలీస్‌ సిబ్బంది చురుకైన పాత్ర పోషించారని.. ఇతర పోలీస్‌ సిబ్బంది దీని నుండి నేర్చుకుంటారని, ప్రజలకు ఏదైనా సహాయం అవసరమైతే వెంటనే పనిచేస్తారని నేను నమ్ముతున్నాను' అని సీనియర్‌ పోలీస్‌ అధికారి అన్నారు.