Oct 03,2020 23:46
భూగర్భం తడారుతోంది!

గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో భూగర్భజలాల వెలికితీత, వాడకం ఎంతగానో పెరిగింది. తాగునీటి కోసం, వ్యవసాయ అవసరాలకు ప్రపంచంలో మరెక్కడా లేనంతగా ఇక్కడ నీటిని వినియోగిస్తున్నట్లు అధ్యయనాల్లో వెల్లడయ్యింది. దీన్ని ముందుగానే గ్రహించి, నేషనల్‌ వాటర్‌ పాలసీలు ప్రవేశపెట్టినప్పటికీ ప్రస్తుతమున్న ఈ పరిస్థితి అనుకున్నంత ఆశాజనకంగా లేకపోవడమే ఇప్పుడున్న పెద్ద సమస్య. ఇది 'నీతి ఆయోగ్‌' ప్రచురించిన 'కంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌' ద్వారా స్పష్టమైన విషయం. తాజాగా ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మొదటిగా నీటి తీవ్రతను తెలుసుకునే జాతీయ సూచికను కంపోజిట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఇండెక్స్‌ అభివృద్ధి చేసింది. దీనికోసం భారతదేశంలోని 24 రాష్ట్రాలను అధ్యయనం చేసింది. అందులో 54% భారతీయ భూగర్భజల బావులు ఇంకిపోయినట్లు తెలిసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కోసం భూగర్భ జలాలు ఎంతగా అవసరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పట్టణాల్లో 2020 కల్లా నీటి ఒత్తిడి పెరుగుతుందని ఇంతకుముందే అధ్యయనాలు వెల్లడించాయి. అందుకే ఈ ఇండెక్స్‌ ఇప్పుడు పట్టణాల భూగర్భ జలవనురుల్ని పదిలపరుచుకోవడానికి కార్యాచరణ రూపొందించే విషయంలో దేశం విఫలమైనట్లు తెలియజేస్తోంది.


ప్యాకింగ్‌ వాటర్‌
నిజానికి ఇక్కడ తాగునీటికి ప్రాథమిక వనరు భూగర్భజలాలే. అలాగే కొన్నేళ్ల క్రితం నుంచి ప్యాకెట్లలో, బాటిళ్లలో సరఫరా అవుతున్న తాగునీరు ఉత్పత్తీ బాగానే పెరిగిందనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం నగరాల్లో వాటర్‌ క్యాన్‌లు వినియోగించని గృహాలు అరుదుగా కనిపిస్తాయంటే ఆశ్చర్యపడాల్సిన అవసరమూ లేదు. ఎందుకు దాదాపుగా అందరూ ప్యాకింగ్‌ వాటర్‌నే వాడుతున్నారంటే దీనికి కారణం పెరుగుతున్న నీటి కాలుష్యం. మున్సిపాలిటీలు, వాటర్‌బోర్డుల ద్వారా సరఫరా అవుతున్న నీరు కాలుష్యమైనదే కాకుండా వీటితో నీటి సంబంధిత వ్యాధులూ ప్రబలడమేనని అధ్యయనాలూ చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భూగర్భ జలాలకు డిమాండ్‌ మరింత పెరిగింది. చాలా నగరాల్లో ఈ ప్యాకేజ్‌ నీరు 20 లీటర్లకుగాను రూ.30 నుంచి రూ.50 ఉన్నట్లు తెలుస్తుంది. 2018లోనే జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వీటి ఉత్పత్తి పరిమితినీ దాటేస్తున్నట్లు గమనించింది. దీనిపై అప్పట్లో న్యాయపరమైన ప్రశ్నలూ తలెత్తాయి. ఇంత విపరీతంగా నీటిని సరఫరా చేస్తున్న ఈ కంపెనీలు ప్రభుత్వ సంస్థలతో, అధికారులతో కుదుర్చుకుంటున్న ఒప్పందాల్లో, వీటిని క్రమబద్ధీకరించడంలో ఇంకాస్త పారదర్శకత అవసరం ఉందని నిపుణుల అభిప్రాయం. విచిత్రం ఏమంటే దాదాపుగా అన్ని వాటర్‌ బాటిళ్లపై ఐఎస్‌ఐ స్టాంప్‌ ఉంటుంది! అది సరే, వీటి కోసం వృథా చేస్తున్న నీరు ఎంతో లెక్క తేలాలి. పేదవారు భూగర్భజలాలను వినియోగించుకోవడానికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి ఖర్చు పెట్టగలిగిన వారు భూగర్భ జలాలను సంరక్షించు కోగలుగుతున్నారా అనేది పరిశీలకుల ప్రశ్న.


పర్యావరణ సంరక్షణ
భూగర్భ జలవనరుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే విషయంపై అన్ని పట్టణాల్లోనూ అవగాహన ఇప్పుడు ఎంతో అవసరం. నీటి కుంటలు, చెరువులు, తేమ నేలలు, నదులను సంరక్షించుకోగలిగితే భూగర్భ జల వనరుల్ని రీఛార్జ్‌ చేసుకోవచ్చని అందరూ గ్రహించే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రజల్లో అవగాహన ఎంత అవసరమో అంతకుమించి పాలకులు, అధికారుల్లోనూ స్పందన కావాలి. మన దేశంలో నీరు అనేది పాలనాపరమైన రాజ్య విషయం. అందుకే దాని సంరక్షణ అనేది రాష్ట్రాలే చేపట్టాలి. ఇక్కడ కొన్ని చట్టపరమైన ఇబ్బందులున్నప్పటికీ వాటిని అధిగమించి, మెరుగైన భవిష్యత్తు కోసం న్యాయవ్యవస్థా కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంది. అలాగే సమాజంలో కొరవడిన సామాజిక సమానత్వం, ముఖ్యంగా పర్యావరణ మార్పు వంటి సవాళ్లను సరిదిద్దకుండా భూగర్భ జలాల సంరక్షణ అనేది చాలా కష్టమైన విషయమనీ అంతా గ్రహించాలి. భూగర్భ జలాలను సంరక్షించే క్రమంలో ప్రజలకు ప్యాకేజ్‌ నీటిని అలవాటు చేస్తున్నప్పటికీ సురక్షితమైన నీటిని అందించే విషయంలో శ్రద్ధ అవసరం. అంతకుమించి భవిష్యత్తు తరాల కోసం, మానవ మనుగడకు ముప్పు వాటిల్లకుండా భూగర్భ జల సంరక్షణకు అంతా తోడ్పడాలి. దానికి కాలుష్యరహిత పర్యావరణం దిశగా అడుగులు వేయాలి.