Sep 15,2021 22:01

*  20న బైక్‌ యాత్రలకు పిలుపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
ఈ నెల 27న చేపట్టనున్న భారత్‌ బంద్‌ దేశ ప్రజల ఉమ్మడి ఉద్యమం అని దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌ (డిఎస్‌ఎంఎం) జాతీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. భారత్‌ బంద్‌కు మద్దతుగా కెవిపిఎస్‌ ఆధ్వర్యాన విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం బుధవారం జరిగింది. బంద్‌ను జయప్రదం చేయాలని దళిత, గిరిజన, విద్యార్థి, యువజన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా బైక్‌ యాత్రలు నిర్వహించాలని కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కులవ్యవస్థను పెంచి పోషిస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా దళిత, గిరిజనులపై దుర్మార్గమైన దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులు చేసిన అధిపత్య పెత్తందార్లను కాపాడేందుకు ఎస్‌సి, ఎస్‌టి చట్టాన్ని నీరుగార్చారని విమర్శించారు. సబ్‌ప్లాన్‌ నిధులను కేటాయించడం లేదని తెలిపారు. ప్రపంచీకరణ విధానాలతో రిజర్వేషన్లకు గండికొడుతూ సామాజిక న్యాయాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక హక్కులను కాలరాస్తూ యాజమాన్యాలకు అనుగుణంగా కార్మిక చట్టాలను మార్చేశారని విమర్శించారు. లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కారు చౌకగా అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు చేస్తున్న ఉద్యమానికి కొనసాగింపుగా, మనువాద మతోన్మాద మోడీ ప్రభుత్వం మొండి వైఖరికి వ్యతిరేకంగా జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను హరించే లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, ధరలు తగ్గించాలని, పౌర హక్కులు కాపాడాలని, అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, ఉపాధి హామీ చట్టాన్ని విస్తరించి పట్టణాల్లో కూడా అమలు చేయాలని, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు, విద్యుత్‌ బిల్లును రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కెవిపిఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి జి.నటరాజ్‌ ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశానికి డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.సూర్యారావు, సిఐటియు రాష్ట్ర నాయకురాలు డి.రమాదేవి, పిడిఎస్‌యు అధ్యక్షులు రామకృష్ణ, ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్ల సాధన సమితి జాతీయ అధ్యక్షులు లాం జైబాబు, డిగ్రీ కాలేజ్‌ లెక్చరర్ల అసోసియేషన్‌ అధ్యక్షులు కె.భాస్కర్‌రావు, ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు, కెవిపిసిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసిపోగు రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.