Oct 28,2021 19:36

భీమసింగి సుగర్స్‌

 ప్రజాశక్తి - జామి : బొంకరా...బొంకరా అంటే మా ఊర్లో తాటికాయ పనసకాయంతా అన్నాడట వెనుకటి ఒకడు. భీమసింగి సహకార చక్కెర పరిశ్రమను తెరిపించడం పట్ల ప్రభుత్వ వైఖరి అచ్చం అలానే ఉంది. ఫ్యాక్టరీని తిప్పేందుకు చెరకు సాగు లేదని చెప్పుకొస్తోంది. కానీ ఇది వాస్తవం కాదని చెరకు రైతు సంఘాలు ప్రభుత్వ వాదనను కొట్టిపారేస్తున్నాయి.
జిల్లాలో 26,185ఎకరాల్లో చెరకు సాగు అవుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. భీమసింగి సహకార ఫ్యాక్టరీ పరిధిలో సుమారు 5,482.5 ఎకరాల్లో చెరకు సాగు అవుతోంది. ఇందులో అత్యధికంగా జామి మండలంలో 2,297.5 ఎకరాల్లో సాగవ్వగా, ఎస్‌.కోటలో 1,570 ఎకరాలు, వేపాడలో 430ఎకరాలు, దత్తిరాజేరులో 442.5ఎకరాలు, ఎల్‌.కోటలో 117.5, మెంటాడ 200, గజపతినగరం 140, బొండపల్లి 105, గంట్యాడ 45, విజయనగరం 57.5, నెల్లిమర్ల 27.5, పూసపాటిరేగ 50 ఎకరాల్లో సాగవుతోంది. ఇది కాకుండా విశాఖ జిల్లా ఆనందపురం, పద్మనాభం మండలాల నుంచి కూడా భీమసింగి ఫ్యాక్టరీకి చెరకు తొలుతారు. ఇలా అధికారుల లెక్కల ప్రకారం భీమసింగికి ఈమేరకు చెరకు లభ్యమవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ విశాఖ జిల్లా చెరకును పక్కన పెట్టిన భీమసింగి ఫ్యాక్టరీ పరిధిలో ఎకరాకు సరాసరిన 25 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. దీని ప్రకారం 5,482.5 ఎకరాలు సాగుకు సుమారుగా 1,37,062.5 టన్నుల చెరకు లభ్యమవుతోంది. కానీ ఇంత కన్నా ఎక్కువ చెరకు లభ్యమవుతుందని రైతు సంఘాలు, రైతులు చెబుతున్నారు.
అసలేం జరుగుతోంది!
వాస్తవానికి పంట సాగు లెక్కల ప్రకారం అధికారులు చెరకు లెక్కలను ప్రభుత్వానికి ఇస్తున్నారు. కానీ ఇందులో డొల్లతనం కొట్టొచ్చునట్లు కనిపిస్తుంది. వాస్తవానికి ఒకరైతు పది ఎకరాల్లో వరి, చెరకు, మొక్కజొన్న ఇలా పంటలు సాగు చేస్తే, పంటల నమోదు చేసేటప్పుడు కేవలం తన పది ఎకరాల్లో వరి సాగు చేస్తున్నానని నమోదు చేస్తున్నాడు. ఇలా నమోదు చేయడానికి కారణం లేకపోలేదు. విత్తనాలు, ఎరువులు పంట నమోదును బట్టి పంపిణీ చేస్తారు. కాబట్టి వరి పంట నమోదు చేసుకుంటే ఖరీఫ్‌ ఇబ్బందులు ఉండవని రైతు భావిస్తున్నాడు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పర్యటించి ఎక్కడ ఏ పంట సాగవుతోందో చూసి అధికారి నమోదు చేయాలి. కానీ ఫీల్డ్‌ మీదకు వెళ్లకుండా అధికారులు పంటలు నమోదు చేస్తున్నారు. ఇలా చెరకు సాగులో డొల్లతనం కనిపిస్తోంది. ఈ కాకిలెక్కల వలనే ప్రతి క్రషింగ్‌ సీజన్‌లో బెల్లం క్రషర్లు వేలాది టన్నుల చెరకు ఆడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీన్ని అవకాశంగా తీసుకుని ప్రభుత్వం చెరకు లేదనే వంకతో ఫ్యాక్టరీని మూసివేయాలని చూస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.
సహకార రంగాన్ని కాపాడుకోవాలి
సహకార రంగాన్ని కాపాడుకోవాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే ఫ్యాక్టరీని తిప్పొచ్చని రైతు సంఘాలు, వామపక్షాలు చెబుతున్నాయి. జిల్లాలో 26వేల ఎకరాల్లో చెరకు సాగవుతోంది. ఇందులో ఎక్కువగా చెరకు బొబ్బిలి ప్రాంతంలోని ఎన్‌సిఎస్‌ సుగర్స్‌కు తరలిస్తున్నారు. రైతులకు కోట్లాది రూపాయలు బకాయిలు పెడుతున్న ప్రయివేటు పరిశ్రమ అయిన ఎన్‌సిఎస్‌ సుగర్స్‌కు రైతుల పండించే చెరకును తోలడం కన్నా, సహకార ఫ్యాక్టరీని నిలబెటుకునేందుకు భీమసింగికి చెరకును మళ్లించడం ప్రభుత్వానికి పెద్దపనేం కాదు. భీమసింగి చెరకును గత ఏడాది ఎన్‌సిఎస్‌ సుగర్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈలెక్కన భీమసింగికి సరిపడా చెరకును ప్రభుత్వ పెద్దలు మళ్లించి, ఫ్యాక్టరీని నిలబెట్టవచ్చు. అయితే చెరకు లేదు కాబట్టి ఫ్యాక్టరీని మూసేస్తామని చెప్పడం వట్టి బూటకం.