Mar 21,2021 12:16

మనదేశాన్ని బ్రిటీష్‌ బానిస బంధనాల నుండి విముక్తి చేయడానికి సర్దార్‌ భగత్‌సింగ్‌ సహా రాజగురు, సుఖదేవ్‌ నాడు ఉరికంబమెక్కారు. ఆనాటి త్యాగధనుల పోరాట ఫలితంగా సాధించుకున్న స్వాతంత్య్రాన్ని నేడు మోడీ సారధ్యంలోని బిజెపి ప్రభుత్వం స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు తాకట్టుపెడుతోంది. బిజెపికి దన్నుగా ఉన్న కార్పొరేట్లు దేశ సహజ సంపదను, ప్రభుత్వ రంగాన్ని, కార్మిక, కర్షకుల స్వేదాన్ని సొంతం చేసుకోవడానికి వరుసపెట్టి నిరంకుశ నల్ల చట్టాలను తెస్తోంది. ఈ చట్టాలను తిప్పి కొట్టడం ద్వారా ప్రజలు తమను తాము రక్షించుకోవడమే కాకుండా దేశ భవిష్యత్తునూ కాపాడినవారవుతారు. నేడు జరుగుతున్న రైతాంగ పోరాటాలు, కార్మిక, ఉద్యోగ సమ్మెలు నాటి స్వాతంత్య్రోద్యమాన్ని తలపింపజేస్తున్నాయి.

నాడు బ్రిటిషువాళ్ళు స్వయంపోషక గ్రామాలను విధ్వంసం చేసి భూస్వాములకు, జమీందార్లకు భూమిని కట్టబెట్టారు. నేడు మోడీ ప్రభుత్వం రైతుల కష్టార్జితమైన భూముల్ని కార్పొరేట్‌ కంపెనీలపరం చేయడానికి పూనుకుంటున్నది. అందుకే మూడు వ్యవసాయ చట్టాలను హడావుడిగా తీసుకొచ్చింది. కరోనా మహమ్మారితో జనమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో దొంగదెబ్బ తీసింది. నాడు ఈస్టిండియా కంపెనీ రాజుల మధ్య తంపులు పెట్టి లోబరుచుకొని, దేశాన్ని హస్తగతం చేసుకుంది. భూములు, గనులు, అడవుల వంటి సహజ సంపదను కొల్లగొట్టింది. చేతివృత్తులను నాశనం చేసింది. వ్యవసాయ సంస్కరణల పేరుతో మార్కెట్‌, నగదు కార్యకలాపాలను ప్రవేశపెట్టింది. వ్యవసాయ ఉత్పత్తులను కారుచౌకగా కొల్లగొట్టింది. తమ కాళ్ళ మీద తాము నిలబడి, స్వతంత్రంగా బతుకుతున్న రైతులను పరాధీనం చేసింది. పన్నులు పెంచింది. పన్నుల కోసం రైతులు అప్పులు చేశారు. అప్పులు తీర్చడానికి భూములు అమ్మారు. భూములు కోల్పోయి, కూలీలుగా మారారు. కూలీలు వలసబాట పట్టారు. నాటి పరిణామాలు యథాతధంగా కాకపోయినా మరో రూపంలో నేడు మన కళ్ళకు కడుతున్నాయి. సంక్షోభంలో ఉన్న కార్పొరేట్‌ వ్యవస్థ లాభాల కోసం వ్యవసాయంపై కన్నేసింది. స్వేచ్ఛ పేరుతో రైతులను మభ్యపెట్టి, భూములు గుంజుకోవాలనుకుంది. కానీ రైతులముందు ఈ నాటకాలు సాగలేదు. సకాలంలో మేలుకున్న రైతాంగం జూలు విదిల్చి, కదన రంగంలోకి దిగింది. తమ తక్షణ సమస్యలపై కాకుండా దీర్ఘకాల ప్రభావం చూపే విధానాలపై పోరాడటం స్వాతంత్య్రా నంతరం ఇదే మొదటిసారి.
 

ఇది మరో స్వాతంత్య్ర పోరాటం..
ఈ పోరాటానికి నాటి స్వాతంత్య్రోద్యమమే స్ఫూర్తి. ఆ స్వాతంత్య్ర పోరాటంలో నేలకొరిగిన భగత్‌సింగ్‌ లాంటి అమరవీరుల త్యాగం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. నాడు భగత్‌సింగ్‌ కేవలం బ్రిటిషు దాస్యం నుండి విముక్తిని మాత్రమే కోరుకోలేదు. రైతుల, కార్మికుల శ్రమ ఫలితం వారికే దక్కాలని, అందుకు సోషలిజమే మార్గమని నమ్మాడు. దున్నేవాడికే భూమి కావాలని కోరుకున్నాడు. భూస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ నాశనం కాకుండా రైతుకూలీలకు విముక్తి దొరకదని భావించాడు. ఆయన భావాలు, రచనలు చేసిన కృషి నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న రైతు, కార్మికుల పోరాటాలకు స్ఫూర్తినిస్తుంది.
 

21 శతాబ్దంలో 19 నాటి చట్టాలు..
దేశ ప్రజలంతా నల్ల చట్టాలు రద్దు చేయాలని కోరుతున్నా మోడీ మొండిగా, మూర్ఖంగా ముందుకు పోతున్నాడు. ఇప్పటికే రైతు ఉద్యమాలను బలపరుస్తున్నా, మద్దతిస్తున్నా, మాటమాత్రంగా సంఘీభావం తెలియజేసినా వారిపై వేధింపులు పెరుగుతున్నాయి. దిశా రవి లాంటి యువతులను మానసిక హింసకు గురిచేసి, జైళ్ళకు పంపారు. తాప్సీ, అనురాగ్‌కశ్యప్‌ లాంటి సినీ ప్రముఖుల ఇళ్ళపై ఐటి దాడులు చేశారు. సోషల్‌ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినవారిపై కేసులు పెడుతున్నారు. మోడీ విధానాలను విమర్శించిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. నాడు బ్రిటిషు వాళ్ళు తమ పెత్తనాన్ని కాపాడుకోవడానికి తెచ్చిన రాజద్రోహ నేరం సెక్షన్లను నేడు ప్రజాస్వాములని గొంతులు చించుకునే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. 2010లోనే బ్రిటీషు ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసినా మన దేశంలో ఇంకా బానిసపాలన వాసనపోలేదు. రాజులు పోయినా రాజద్రోహ నేరం మాత్రం కొనసాగుతోంది. నాడు బ్రిటీషు ప్రభుత్వం రౌలట్‌ లాంటి నిరంకుశ చట్టాలను తెస్తే, నేడు మోడీ ప్రభుత్వం ఉపా, ఎన్‌ఐఏ లాంటి చట్టాలను దేశం మీద రుద్దుతోంది. దేశానికి పూర్వ వైభవం తెస్తామని చెబుతున్న మోడీ - షా ద్వయం ప్రజాస్వామ్యం గొంతు నులిమి, రాచరిక కాలంనాటి వ్యవస్థను పునరుద్ధరించడానికి, కుల వ్యవస్థకు ప్రాణం పోయడానికి ప్రయత్నిస్తోంది. మారిన కాలానికి పాత చట్టాలు పనికిరావని, కొత్త చట్టాలు కావాలని చెప్తున్న మోడీ 19వ శతాబ్దం నాటి స్వేఛ్చా వాణిజ్య చట్టాలను పునరుద్ధరించడానికి ప్రయత్నించడాన్ని ఏమనాలి? ఈ దేశాన్ని ఎక్కడకు తీసుకుపోతున్నట్లు?

నాటి జయచంద్రులే మళ్లీ జన్మించారు.. 
నాటి బ్రిటీషు సేవలో నేటి బిజెపి పూర్వీకుల హస్తాలు మలినమయ్యాయి. వారంతా బ్రిటీషు వారి చేతిలో పనిముట్లుగా మారి, మతం పేరుతో ప్రజల మధ్య చీలికలు తెచ్చారు. దేశ ఐక్యతను దెబ్బకొట్టి, బ్రిటీషు వారికి లొంగిపోయారు. ఇలాంటి విద్రోహ వారసత్వం కలిగిన బిజెపి, నేడు మరోమారు విదేశీ కార్పొరేట్ల చేతిలో పెట్టడానికి కుయుక్తులు పన్నుతోంది. దీన్ని అడ్డుకోవడానికే నేడు కార్మిక, కర్షకులు కదులుతున్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లో సైతం అనేకమంది ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. ఆ పార్టీలోనూ అంతర్మధనం సాగుతోంది. గుజరాత్‌లో 2000 సంవత్సరంలో ప్రతిపక్షాలను, లౌకికవాదులనే కాదు తమ స్వంతపార్టీలోని అసమ్మతివాదులనూ భౌతికంగా ఎన్‌కౌంటర్‌ చేసిన చరిత్ర మోడీ, అమిత్‌ షా ద్వయానిది. గత సంవత్సరం ఢిల్లీలో పౌరసత్వ ఉద్యమాన్ని అణచివేయడానికి అనుసరించిన ఎత్తుగడలు, ఇప్పుడు రైతు ఉద్యమాన్ని దెబ్బకొట్టడానికి జనవరి 26న అనుసరించిన కుయుక్తులు అన్నీ ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలే.
 

విస్తరిస్తున్న ప్రజా ఉద్యమాలు.. కార్మిక కర్షక ఐక్యతకు పునాదులు..!
పంజాబ్‌తో ప్రారంభమై తమిళనాడు వరకు విస్తరించిన రైతాంగ ఉద్యమం అనేక ఆటుపోట్లు తట్టుకుని బలపడుతోంది. దాన్ని విచ్ఛిన్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం పన్నే కుయుక్తులను ఎదుర్కొని, విస్తరిస్తోంది. జనవరి 26 ఘటనను ఉపయోగించుకుని ఉద్యమాన్ని బలహీనపర్చాలన్న బిజెపి ఎత్తుగడ పారలేదు. దీనికి విరుగుడుగా కొన్ని వేలమంది అదనంగా వచ్చి, ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమంలో చేరారు. మోడీ మొండివైఖరితో రైతులు దీర్ఘకాల పోరాటానికి సిద్ధపడుతున్నారు. ఢిల్లీ సరిహద్దులో టెంట్ల స్థానంలో ఇటుకలతో ఆవాసాలు ఏర్పడుతున్నాయి. బంద్‌లు, ట్రాక్టర్‌ ర్యాలీలు, రైలు, రాస్తారాకోలు, దీక్షలు, జ్యోతి ప్రజ్వలనలు వంటి అనేక రూపాల్లో పోరాటం కొనసాగుతోంది. నేడు మరోసారి 26వ తేదీ భారత్‌ బంద్‌కు ప్రజలంతా సన్నద్ధమవుతున్నారు. సమస్య పరిష్కారం ఆలస్యమయ్యేకొద్దీ ప్రజల్లోనూ పట్టుదల పెరుగుతోంది.
 

తన గోతిని తానే తవ్వుకుంటున్న బిజెపి
మోడీ-షా పుణ్యమా అంటూ ఒంటరిగా ఉన్న రైతులకు కార్మికలోకం తోడయ్యింది. కార్మిక, కర్షక ఐక్యతకు పాలకుల మొండివైఖరే తోడ్పడింది. వ్యవసాయ నల్ల చట్టాలనే కాకుండా కార్మిక హక్కులను హరిస్తూ లేబర్‌ కోడ్‌లను తెచ్చింది. గుండుగుత్తగా ప్రైవేటీకరణ విధానాలను అమలుచేస్తోంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవ చిహ్నంగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడంపై రాష్ట్రం కన్నెర్రజేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ విధానాలను రకరకాలుగా సమర్ధిస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌, తెలుగుదేశం సైతం ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకంచక తప్పలేదు. బిజెపికి ఆంతరంగికుడుగా మారిన జనసేన పవన్‌కల్యాణ్‌ సైతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించక తప్పలేదు. పైగా తమ వారిని అవమానపరుస్తున్నారంటూ బిజెపిపై బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇప్పటివరకు రాజకీయాలకు, పార్టీలకు దూరంగా ఉంటున్న రైతు ఉద్యమ నేతలు మొదటిసారి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించమని బహిరంగంగా పిలుపునిచ్చారు. అంతేకాదు రాష్ట్రాల్లో పర్యటించి, సభలు కూడా పెడుతున్నారు. ఇలా రాజకీయ రంగంలోకి రైతు నాయకులను లాగిన ఘనతా బిజెపిదే. ఇలా తన తప్పుడు విధానాలతో మిత్రులను దూరం చేసుకుంటున్న ఘనత బిజెపికే దక్కుతుంది.
 

కార్పొరేటీకరణపై ఒక్కటై పోరాడుదాం..
భగత్‌సింగ్‌ స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు మరో పేరు. ఉద్యమాలకు ఊపిరి. యువతకు స్ఫూర్తి. భారతదేశ భవిష్యత్తుకు దిక్సూచి. నేటి పాలకుల్లానే నాడు బ్రిటీషువారు భగత్‌సింగ్‌ను ఉగ్రవాదిగా ముద్ర వేశారు.. ఉరి తీశారు. కానీ వ్యక్తిగత హింసావాదం మార్గం కాదని, వర్గ పోరాటాలు, ప్రజా భాగస్వామ్యంతోనే సమాజాన్ని మార్చగలమని.. తనను ఉరితీసే నాటికే భగత్‌సింగ్‌ ప్రకటించాడు. ఆయన అనుచరులంతా ఆ తర్వాత కమ్యూనిస్టులుగా మారారు. ప్రజలను కూడగట్టడంలో, ఐక్యం చేయడంలో అసమాన కృషి చేశారు. భగత్‌సింగ్‌ స్ఫూర్తితో, జాతీయోద్యమ మార్గంలో నేడు రైతు ఉద్యమం అత్యంత శాంతియుతంగా కొనసాగుతోంది. దీన్ని దారి తప్పించాలని పాలకులు ఎన్ని కుట్రలు చేసినా సహనంతో, ఐకమత్యంతో రైతుసంఘాలు సాగుతున్నాయి. ఈ ఐక్యత అనుపమానం. ఈ పోరాటం అజరామరం. విజయం సాధించేదాకా వెనుదిరిగేది లేదని రైతులు తెగేసి చెప్తున్నారు. దేశ ప్రజలందరూ ఉద్యమానికి బాసటగా నిలబడ్డారు. మార్చి 23 భగత్‌సింగ్‌ వర్ధంతి సందర్భంగా ఊరూరా, వాడవాడలా ఉద్యమ జెండాలను ఎగురవేయాలి. కార్మిక, కర్షక ఐక్యతను చాటిచెప్పాలి. 26వ తేదీ బంద్‌ను జయప్రదం చేయడానికి సన్నాహాలు చేయాలి. అన్ని పార్టీలు, సంస్థలు, ప్రముఖులు, ప్రజలంతా దీనిలో భాగస్వాములు కావాలి. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదాకా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచన విరమించేవరకూ భగత్‌సింగ్‌ సాక్షిగా ఈ పోరాటం కొనసాగుతుంది.
వి.శ్రీనివాసరావు, సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు

 

 

 

    * వి.శ్రీనివాసరావు, సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు