Oct 27,2021 23:49

మృతదేహాన్ని పరిశీలిస్తున్న డిఎస్‌పి శ్రావణి

ప్రజాశక్తి - వీరఘట్టం: భార్యను భర్త హతమార్చిన ఘటన మండలంలోని కంబవరవలస గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... విజయనగరానికి చెందిన వ్యక్తితో బి.పైడమ్మ(51)కు వివాహమైంది. ఆయనతో ఇద్దరు మగ పిల్లలు మురళి, రామారావుకు జన్మనిచ్చింది. వలస కార్మికుడు బి.గౌరితో పరిచయం కావడంతో 20 ఏళ్ల క్రితం భర్త, పిల్లలను విడిచిపెట్టి వచ్చేసింది. గౌరి తన మేమామలు ఉంటున్న కంబరవలస పైడమ్మతో వచ్చి స్థిరపడ్డాడు. అక్కడే స్థిరనివాసం ఏర్పర్చుకున్నాడు. గౌరి ప్రతి రోజూ మద్యం సేవించి పైడమ్మతో గొడవ పడేవాడు. చుట్టు పక్క ఇళ్ల వారు వచ్చి ప్రశ్నిస్తే 'ఇది భార్యాభర్తల మధ్య గొడవ మీకెందుకని కత్తితో బెదిరించేవాడ'ని గ్రామస్తులు చెబుతున్నారు.
మృతదేహంపై గాయాలు
రోజూ మాదిరిగా మంగళవారం రాత్రి కూడా గౌరి, పైడమ్మ ఘర్షణ పడ్డారు. గౌరీ తన ఇంట్లో టీవీ సౌండ్‌ పెంచి భార్యను పీకునులిమి చంపేశాడు. తన చేతులకు మట్టి అంతకుండా తన మేనమామలు కరక గురువులు, రామయ్య, చిన్నయ్య వద్దకు వెళ్లి నా భార్య గుండెపోటుతో మృతిచెందిందని చెప్పి, నమ్మించాడు. మంగళవారం రాత్రి 8.30గంటల సమయంలో పైడమ్మకు మొదటి సంతానమైన కుమారులకు ఫోన్‌ చేసి, మీ అమ్మ చనిపోయిందని చెప్పాడు. వారు వచ్చి మృతదేహం వద్ద రోదించారు. ఉదయం వేకువజామున మృతదేహం చెవుల నుంచి రక్తం రావడం, మెడపై గాయాలు ఉండటం గుర్తించిన కుమారులు డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. విషయం తెలుసుకున్న డిఎస్‌పి శ్రావణి, సిఐ శంకరరావు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహంపై గాయాలను గుర్తించి, ఇది సాధారణ మరణం కాదని, హత్య చేసినట్లు నిర్ధారించారు. మురళి, రామప్పడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆప్పత్రికి తరలించారు. పోలీసుల రాకను చూసిన గౌరీ అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టరు.