Oct 14,2021 20:40

పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆశాభావం
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో ఈసారి తప్పక భారత్‌ను ఓడిస్తామని పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండున్నరేళ్ల తర్వాత జరుగుతున్న ఇండోాపాక్‌ పోరులో తప్పక విజయం సాధిస్తామన్నాడు. ఇటీవల యుఏఇలో ఆడిన అనుభవం తమకు కలిసిరానుందని, ప్రతి మ్యాచ్‌లో ఉండే ఒత్తిడి, తీవ్రత మాకు తెలుసు. ఇరుజట్లకు ఇదే తొలి మ్యాచ్‌ కావడంతో గెలుపే థ్యేయంగా బరిలోకి దిగుతామన్నాడు. తొలి మ్యాచ్‌లోనే గెలిచి అదే దూకుడును కొనసాగిస్తామన్న నమ్మకం ఉందని, గత మూడు, నాలుగేళ్లుగా యుఏఇలతో మ్యాచ్‌లు ఆడుతున్న దృష్ట్యా అక్కడి పరిస్థితులు బాగా తెలుసని చెప్పుకొచ్చాడు. పిచ్‌ ఎలా మారుతుంది, అందుకు తగినట్లుగా ఎలా మార్పులు చేసుకోవాలో బ్యాటర్లకు తెలుసని, ఆ రోజు ఎవరు మెరుగ్గా ఆడతారో వాళ్లే గెలుస్తారని బాబర్‌ చెప్పాడు. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన ఆరు టి20 మ్యాచుల్లో భారత్‌ 5, పాకిస్తాన్‌ ఒక మ్యాచ్‌లో గెలిచాయి.