Apr 08,2021 07:53

న్యూఢిల్లీ : భారత్‌లో రష్యా రక్షణ పరికరాల తయారీపై చర్చలు జరిపినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్‌రోవ్‌ తెలిపారు. స్వల్పకాలిక పర్యటనపై మంగళవారం భారత్‌ వచ్చిన లావ్‌రోవ్‌ భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో చర్చలు జరిపారు. సంయుక్త పత్రికా సమావేశం అనంతరం లావ్‌రోవ్‌ ఇస్లామాబాద్‌కు బయల్దేరి వెళ్లారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం, క్రిమియాపై దాడి నేపథ్యంలో, రక్షణ, భద్రతా రంగాల్లో ఇతర దేశాలతో రష్యా సహకారాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకుంటోంది. గతేడాది రష్యా నుండి ఎస్‌-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసినందుకు టర్కీపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ ఏడాది చివరిలో భారత్‌కు కూడా రష్యా నుండి ఈ క్షిపణి వ్యవస్థలు రానున్నాయి. ఈ విషయమై ఆంక్షలు ఎదుర్కొనక తప్పదని బైడెన్‌ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరిక చేసింది. రష్యా అంతర్జాతీయ రక్షణ విక్రయాలను బహిరంగంగానే అమెరికా నిరుత్సాహపరచడంపై లావ్‌రోవ్‌ మాట్లాడుతూ, భారత్‌తో చర్చల్లో ఈ విషయం ప్రస్తావనకు రాలేదన్నారు. అమెరికా ప్రకటనలపై చర్చించడానికి బదులుగా మా సైనిక సహకారాన్ని మెరుగపరుచుకోవాలనకున్నామని చెప్పారు. 'మేడ్‌ ఇన్‌ ఇండియా' భావన పరిధిలోనే రష్యా సైనిక పరికరాల అదనపు తయారీ అవకాశాల గురించి చర్చించినట్లు చెప్పారు. మరిన్ని రష్యా రక్షణ పరికరాల కొనుగోలుపై నిర్దిష్టంగా ఎలాంటి చర్చలు జరగలేదని జైశంకర్‌ తెలిపారు.