Nov 27,2020 16:56

ఢిల్లీ : భారత్‌లో ఏటా 10 కోట్ల డోసులకుపైగా (100 మిలియన్ల) కరోనా వ్యాక్సిన్‌ 'స్పుత్నిక్‌ వీ' ని ఉత్పత్తి చేయనున్నట్లు స్పుత్నిక్‌ సంస్థ ప్రకటించింది. ఇందుకుగాను రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డిఐఎఫ్‌), భారతీయ ఫార్మా దిగ్గజం హెటిరో చేతులు కలిపినట్లు ఓ ప్రకటనలో స్పుత్నిక్‌ వెల్లడించింది. దేశంలో తమ టీకా ఉత్పత్తి 2021 ఆరంభంలో ప్రారంభమవుతుందని సంస్థ వెల్లడించింది. ఈ మేరకు తమకు, హెటిరోకు ఒప్పందం కుదిరినట్లు ఆర్‌డిఐఎఫ్‌ సిఈఒ కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటించారు. మధ్యంతర ఫలితాల్లో తమ టీకా 95 శాతం ప్రభావం చూపినట్లు సిఈఒ వివరించారు.
         '' ప్రపంచం ఎంతగానో వేచి చూస్తున్న స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ తయారీలో భాగంగా ఆర్‌డిఐఎఫ్‌ తో చేతులు కలిపినందుకు ఆనందంగా ఉంది. భారత్‌లో జరుగుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాల కోసం మేం వేచిచూస్తున్నాం. టీకాను స్థానికంగా తయారు చేయటం వల్ల దానిని బాధితులకు త్వరగా అందించటం సాధ్యమవుతుంది '' అని హెటిరో డైరెక్టర్‌ బి.మురళీ కృష్ణా రెడ్డి వెల్లడించారు.
        భారత్‌ అవసరాల మేరకు వ్యాక్సిన్‌ ఉత్పత్తిని తగినంతగా పెంచే సామర్థ్యముందని ఆర్‌డిఐఎఫ్‌ సిఈఒ తెలిపారు. తద్వారా స్పుత్నిక్‌ టీకా.. దేశంలో కోవిడ్‌-19 మహమ్మారికి సమర్థవంతమైన పరిష్కారం కాగలదని అన్నారు. కాగా, రష్యాలో 40 వేల మందిపై జరిగిన రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ సత్ఫలితాలిచ్చినట్లు ఆర్‌డిఐఎఫ్‌ ఇటీవల ప్రకటించింది. మూడో దశ ప్రయోగాలకు తమకు అనుమతి లభించిందని, వీటిని బెలారస్‌, యుఎఈ, వెనెజులా, తదితర ప్రాంతాల్లో కొనసాగిస్తున్నామని సంస్థ వెల్లడించింది.