Nov 27,2020 20:23

ఖాట్మండు : భారత్‌, నేపాల్‌లకు పరస్పర అవసరాలు వున్నాయని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా పేర్కొన్నారు. శుక్రవారం ఖాట్మండులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మనం కన్న కలలను మనమొక్కరమే నెరవేర్చుకోలేమని, ఈ ప్రయాణంలో నేపాల్‌లోని మిత్రులు కూడా ఈ కలలను పంచుకోవాలని ఆకాంక్షించారు. మన దక్షిణాసియాలో మనందరికీ పరస్పరం అవసరాలు వుంటాయన్నారు. దౌత్యం, అంతర్జాతీయ వ్యవహారాల ఆసియాన్‌ సంస్థ (ఎఐడిఐఎ) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత ప్రభుత్వ 'మొదటి పొరుగు' భావనకు నేపాల్‌ కీలకమని అన్నారు. నేపాల్‌ వంటి పొరుగు దేశాల అభివృద్ధి, ఆధునీకరణతో అంతర్గతంగా భారతదేశ అభివృద్ధి, ఆధునీకరణ ముడిపడి వుందని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో శ్రింగ్లా చేసిన ప్రసంగాన్ని నేపాల్‌ మీడియా ప్రసారం చేసింది. భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా నేపాల్‌ భూభాగాన్ని ఉపయోగించడానికి తామెన్నడూ అనుమతించబోమని ప్రధాని ఓలి విదేశీ వ్యవహారాల సలహాదారు రాజన్‌ భట్టారారు పేర్కొన్నారు. అయితే తమకు కొన్ని సమస్యలు వున్నాయని, వాటిని సంతృప్తికరంగా పరిష్కరించుకోవాల్సి వుందని అన్నారు. భవిష్యత్‌ తరాలు తమ అభివృద్ధి అవసరాలపై దృష్టి పెట్టేలా కొన్ని ప్రాదేశిక అంశాలను పరిష్కరించుకోవాలని ప్రధాని కె.పి.శర్మ ఓలి అభిప్రాయపడ్డారు. తమ ప్రయోజనాల కోసం భారత్‌ పేరును ఉపయోగించుకోవాలని నేపాల్‌ ఎన్నడూ అనుకోదని భారత విదేశాంగ కార్యదర్శికి ఓలి స్పష్టం చేశారు.