Feb 11,2021 10:45

న్యూఢిల్లీ : రైతుల ఉద్యమానికి సంబంధించి తప్పుడు సమాచారం అందిస్తున్నారన్న , రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన 1,178 ఖాతాలను నిలిపివేయాలని కోరుతూ భారత్‌ ఆదేశాలను ట్విట్టర్‌ పాటించింది. అయితే కేంద్రం పేర్కొన్న ఖాతాలను కాకుండా 500 ఖాతాలపైనే చర్యలు తీసుకున్నామంటూ అమెరికాకు చెందిన ట్విటర్‌ వివరణ ఇచ్చింది. భారత్‌లో ఖాతాలను మాత్రమే నిలిపివేస్తున్నామని స్పష్టం చేసింది. అయితే సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు, జర్నలిస్టుల హ్యాండిళ్లను నిలిపివేయబోమని తేల్చి చెప్పింది. అలా చేయడంమనేది భారత చట్టాల ప్రకారం భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించినట్లే అవుతుందని పేర్కొంది. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంతోపాటు, తన బ్లాగులోనూ పోస్టు పెట్టింది.
ఈ అంశంపై కేంద్రం గుర్రుగా ఉంది. ట్విట్టర్‌ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక్కడ పనిచేస్తున్న ఓ సంస్థగా...భారత ఆదేశాలకు లోబడి పనిచేయాలని, ఇక్కడ చట్టాలను గౌరవించాలని, మీ స్వంత నిర్ణయాలు, మార్గదర్శకాలను అనుసరించకూడదంటూ హెచ్చరించింది. తాము చెప్పిన ఖాతాలన్నీంటిని బ్లాక్‌ చేయాలని మరోసారి ఆదేశాలు జారీ చేసింది. చట్టబద్ధంగా ఆమోదించిన ఏ చట్టాలైనా ఏ వ్యాపార సంస్థ అయినా కట్టుబడి ఉండాలని, అవి తక్షణమే పాటించాలని, పాటించడంలో ఆలస్యం వహిస్తే...అవి అర్థరహితమని పేర్కొంది. గత నెలలో జరిగిన క్యాపిటల్‌ హిల్స్‌ దాడి తరువాత ట్విట్టర్‌ తీసుకున్న చర్యలపై, భారత్‌లో వ్యవహరిస్తున్న తీరు వేర్వేరుగా ఉన్నాయని, ఇది తీవ్ర నిరాశకు గురి చేసిందని పేర్కొంది. ట్విట్టర్‌ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటిశాఖ ఈ విషయాలను చర్చించింది.
కాగా, భావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్య విలువలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంటున్నట్లు అమెరికా పునరుద్ఘాటించింది. అయితే ట్విట్టర్‌ విధానాల విషయానికి వస్తే...ట్విట్టర్‌కే సూచిస్తే బాగుంటుందని అమెరికా అధికార ప్రతినిది నెట్‌ ప్రైజ్‌ అన్నారు. ట్విట్టర్‌ తీసుకున్న చర్యల అనంతరం ఆయన ఈ విధంగా స్పందించారు.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు ఖాతాల్లో తప్పుడు సమాచారం వస్తోందంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీశాఖ ఈనెల 4న ట్విటర్‌కు నోటీసులిచ్చింది. పాకిస్థాన్‌, ఖలిస్థాన్‌తో సంబంధాలున్న మొత్తం 1,178 ఖాతాలను నిలిపేయాలని సూచించింది. తమ ఆదేశాలను ధిక్కరిస్తే జరిమానాతో పాటు, బాధ్యులకు జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది. మంత్రితో సమావేశం కాకముందే, ఖాతాల నిలుపుదలకు సంబంధించి ట్విటర్‌ బుధవారం వివరణ ఇచ్చింది. సమాచార చట్టంలోని సెక్షన్‌-69ఏ కింద కొన్ని ఖాతాలను నిలిపేయాలని కేంద్రం మాకు పలు ఆదేశాలు ఇచ్చింది. వీటిలో రెండు 'ఎమర్జెన్సీ బ్లాకింగ్‌'కు సంబంధించినవని, ప్రభుత్వం సూచించిన వాటిల్లో 500కు పైగా ఖాతాలపై చర్యలు తీసుకున్నామని, తమ 'కంట్రీ విత్‌హెల్డ్‌ కంటెంట్‌ పాలసీ' ప్రకారం అవి భారతదేశ పరిధిలో పనిచేయవని, భావ వ్యక్తీకరణ హక్కును దఅష్టిలో పెట్టుకుని వార్తా సంస్థల, జర్నలిస్టుల, సామాజిక కార్యకర్తల, రాజకీయ నేతల ఖాతాలపై చర్యలు తీసుకోలేదని తెలిపింది. జనవరి 26 నుంచి కంటెంట్‌, ట్రెండ్స్‌, ట్వీట్లను న్యాయబద్ధంగా, నిష్పాక్షికంగా పరిశీలించి... హింస, దూషణ, హాని తలపెట్టడం, భయపెట్టడం వంటి చర్యలతో సంబంధమున్న ఖాతాలపై చర్యలు తీసుకున్నామని తెలిపింది.