Nov 30,2020 23:25

సమావేశంలో మాట్లాడుతున్న అరుణ్‌

ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి
ప్రజలు కష్టాల్లో ఉండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని పట్టణ ప్రజలపై ఇంటిపన్ను, నీటిఛార్జీలు, డ్రెయినేజీ ఛార్జీలు వంటి భారాలు మోపడం తగదని, తక్షణం ఈ జిఒలనుఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా(రాజమహేంద్రవరం) కార్యదర్శి టి.అరుణ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కరోనా సమయంలో ప్రజల కళ్లుగప్పి ఆత్మనిర్బర్‌, భారత్‌ ప్యాకేజీ పేరుతో పట్టణ సంస్కరణలను ముందుకు తెచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పులు ఎరచూపి పట్టణాల్లో భారాలు మోపే షరతులను రుద్దిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం యుధ్ధప్రాతిపదికన ఆర్డినెన్స్‌ 16ను విడుదల చేసి మున్సిపల్‌ చట్టాలను సవరించిందన్నారు. ఈ సవరణ ప్రకారం 2021 ఏప్రిల్‌ నుంచి అద్దె విలువ ఆధారంగా కాకుండా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్ను విధిస్తారని తెలిపారు. దీని వల్ల ఇంటి పన్ను పది రెట్లు పెరుగుతుందన్నారు. అంతేకాకుండా ప్రతి ఏడాది రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రకటించే భూముల విలువల ఆధారంగా ఎప్పటికప్పుడు పన్నులు పెరుగుతాయన్నారు. ఇదే కాకుండా తాగు నీరు, మురుగునీరు నిర్వహణ ఖర్చు మొత్తం ప్రజల నుంచి రాబట్టే విధంగా 196, 197 జిఒలను ఇటీవలే విడుదల చేశారన్నారు. మున్సిపాలిటీలను వ్యాపార సంస్థలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుస్తున్నాయని తెలిపారు. పౌర సదుపాయాలను వ్యాపార సరుకులుగా మార్చుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు జరపకుండా, చర్చించకుండా ఏకపక్షంగా ఆర్డినెన్స్‌ ద్వారా హడావుడిగా చట్టాలు సవరించడం శోచనీయమన్నారు. స్థానిక సంస్థల స్వయం సమద్ధి పేరుతో నిధులు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకుని ప్రజలపై భారాలు వేయడం ప్రజా వ్యతిరేక చర్య అన్నారు. కాబట్టి ఆర్డినెన్సు16, జిఒలు 196,197 లను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే పౌర, ప్రజా సంఘాలు, కాలనీ అసోసియేషన్లు, పౌర సమాజాన్ని కూడగట్టి ఐక్యంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భారాలను, విధానాలను ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.ఎస్‌.మూర్తి,నగర కార్యదర్శి పోలిన వెంకటేశ్వరరావు, నాయకులు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
నగరంలో సుందరీకరణ పేరుతో ప్రజాధనం వథా
ప్రజలు కరోన కష్టాల్లో ఉంటే నగరపాలక సంస్థ అధికారులు సుందరీకరణ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని అరుణ్‌ తప్పు బట్టారు. నగర పాలక సంస్థ రూ.36 కోట్లతో నగరంలో 13 ప్రధాన రోడ్లను అభివద్ధి చేస్తుందన్నారు. దీనిలో 2 కిలోమీటర్ల పొడవు ఉండే ప్రతి రహదారికి రూ.70 లక్షల నుండి రూ.90 లక్షల వరకు సుందరీకరణ కోసం ఖర్చు పెడుతున్నారని తెలిపారు. కరోన కష్టాల్లో ప్రజలు ఉంటే ఈ సోకులు ఎందుకని ప్రశ్నించారు. సుమారు రూ.6 కోట్లు ఇలా వృథాగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. అనవసమైన డివైడర్లు కడుతున్నారని పేర్కొన్నారు. ఈ నిధులు నగరంలో మంచి నీటి పన్ను ప్రజలకు రాయితీగా ఇవ్వొచ్చని తెలిపారు..నగరంలో ఉన్న పార్లమెంట్‌, శాసన సభ్యులు దీనిపై స్పందించాలని ఆయన కోరారు.