Nov 26,2021 06:53

    రానున్న పార్లమెంటు సమావేశాల్లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటు పరం చేస్తారనీ మిగిలిన బ్యాంకుల్లో సర్కారు వాటా తగ్గించేందుకు చట్టాలు చేయనున్నారనీ వస్తున్న వార్తలు ఆందోళనకరం. అంతకు ముందు కొన్ని పారిశ్రామిక కుటుంబాల చేతుల్లోని బ్యాంకులను 1969లో జాతీయం చేశాకనే వాటి విస్తరణ, ఆర్థిక కార్యకలాపాలు సామాన్య ప్రజలకు చేరువ కావడం సాధ్యమైంది. ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా వున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను దెబ్బ తీయాలని నయా ఉదారవాద ఆర్థిక విధానకర్తలు 1991 నుండీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉద్యోగుల పోరాటాలు, ప్రజాందోళనలు, వివిధ రాజకీయ కారణాలవల్ల మధ్యలో కొంత వెనుకపట్టు పట్టి 2014లో మోడీ సర్కారు వచ్చాక ప్రైవేటీకరణ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల సైజు పెరగాలని ఉద్బోధిస్తూ విలీనాలకు తెర లేపింది. మోడీ గద్దెనెక్కే నాటికి 27 పిఎస్‌బిలు వుండగా ఇప్పుడు వాటి సంఖ్య 12కు దిగజారింది. తెలుగు వారి కోడలు ఆర్థిక మంత్రిగా ఉంటూ ప్రతిష్టాత్మకమైన ఆంధ్రా బ్యాంకును అంతర్ధానం చేయడం మరో వైచిత్రి. పెద్ద నోట్ల రద్దు మూలంగా యావత్‌ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యేకించి అసంఘటిత రంగానికి తీవ్ర నష్టం జరగడంతోపాటు బ్యాంకులకూ దెబ్బ తగిలింది.
    ఎన్‌పిఎల పేరిట లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ల రుణాలను ఒక్క కలం పోటుతో రద్దు చేసిన దుష్ట చరిత్ర మోడీ సర్కారుదే! అక్కడితో ఆగకుండా పెద్దపెద్ద బకాయిదార్ల రుణాలను 'మేనేజ్‌' చేయడం కోసం విడిగా ఒక 'బ్యాడ్‌ బ్యాంక్‌' ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. అంటే ఇతర బ్యాంకుల్లో అప్పులు తీసుకొని వాటిని బకాయి పెట్టి ఈ బ్యాడ్‌ బ్యాంకు ద్వారా నామమాత్రపు మొత్తానికి 'సెటిల్‌' చేసుకోవడానికి కార్పొరేట్లకు రాజమార్గాన్ని సృష్టించడమే. తాజాగా పిఎస్‌బిలలో ప్రస్తుతం 51 శాతం, అంతకన్నా ఎక్కువగా వున్న ప్రభుత్వ వాటాలను 26 శాతానికి తగ్గించడం కోసం చట్ట సవరణకు పూనుకోవడం దారుణం. ప్రభుత్వానికి మెజార్టీ వాటాలున్నప్పటికీ సామాన్యులకు రాయితీలు, రైతు రుణ మాఫీ వంటి సంక్షేమ చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. అలాంటిది ప్రభుత్వ వాటా 26 శాతానికి దిగజారిపోతే బ్యాంకులు ఇక సామాన్య ప్రజల మంచి చెడ్డలను పట్టించుకోవు. అంటే చరిత్ర అరవై ఏళ్లు వెనక్కు పోతుంది. ఆనాడు కొన్ని కుటుంబాల చేతిలో వున్న బ్యాంకులు ఇప్పుడు వాటాలు కొనుక్కున్న కొన్ని కార్పొరేట్‌ కంపెనీల స్వాధీనం అవుతాయన్నమాట. అంతేగాక డిజిటల్‌ బ్యారకుల ఏర్పాటుకు సర్కారు మరో ప్రతిపాదన ముందుకు తెచ్చింది. ఆ బ్యాంకుల్లో నగదు లావాదేవీలేవీ జరగవు. డిజిటల్‌ బ్యారకులకు లైసెన్సులు ఇచ్చే విధానంతోపాటు, వాటిని నియంత్రిరచేరదుకు కూడా చట్టం తీసుకురావాలని, ఈ మేరకు నీతి ఆయోగ్‌ తాజా ప్రతిపాదనలు సిద్ధం చేసిరది. ప్రస్తుతం డిజిటల్‌ బ్యారకిరగ్‌ దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మాట నిజం. కాబట్టి ఆ లావాదేవీలను నియంత్రించడం అవసరమే. అయితే కేవలం డిజిటల్‌ బ్యాంకులను మాత్రమే ఏర్పాటు చేస్తే అవి డిజిటల్‌ లావాదేవీలు సాగించే కొద్దిమంది కార్పొరేట్లకు, వ్యాపారులకు, సంపన్నులకు, కొంతమంది ప్రవాస భారతీయులు, వారి కుటుంబాలకు మాత్రమే ఉపయోగపడతాయి. భారీ మొత్తాలలో జరిగే లావాదేవీలు డిజిటల్‌ బ్యాంకులకు మళ్లిపోతే జన్‌ధన్‌ లాంటి చిన్నాచితకా అకౌంట్లతో సాధారణ బ్యాంకులు కునారిల్లిపోతాయి.
   భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య చలామణీ నిలకడగా ఉండడానికి, స్వావలంబన సాధించడానికి వెనుక బ్యాంకింగ్‌ ప్రభుత్వ రంగంలో ఉండడం, వాటిని నియంత్రించేందుకు కట్టుదిట్టమైన బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం, పటిష్టమైన రిజర్వ్‌ బ్యాంకు వంటివి ప్రధానంగా దోహదపడ్డాయి. 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ నిలబడడానికి బ్యాంకుల్లో ప్రభుత్వ భాగస్వామ్యం, ఆర్‌బిఐ రెగ్యులేషన్‌ కీలకమని నాటి, నేటి ప్రధానులు మన్మోహన్‌ సింగ్‌, మోడీ చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. భారత బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రధానంగా పిఎస్‌బిలను దెబ్బ తీయాలన్న మోడీ ప్రభుత్వ యత్నాలను ఉద్యోగులు, దేశ ప్రజానీకం ప్రతిఘటించాలి. తిప్పి కొట్టాలి. మూడు నల్ల వ్యవసాయ చట్టాల రద్దు సాధించుకున్న రైతు ఉద్యమం అందుకు స్ఫూర్తి కావాలి.