Mar 02,2021 23:16

నిరసన చేపడుతున్న బ్యాంకు ఉద్యోగులు

- నిరసనలో యుఎఫ్‌బియు కన్వీనర్‌ నాగరాజు
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి
: బ్యాంకుల ప్రయివేటీకరణను కేంద్రం ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బియు) కన్వీనర్‌ ఇ.నాగరాజు డిమాండ్‌ చేశారు. బ్యాంకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా 15, 16న బ్యాంకు ఉద్యోగుల సమ్మె సన్నాహకాల్లో భాగంగా యుఎఫ్‌బియు ఆధ్వర్యంలో మంగళవారం విద్యానగర్‌లోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముందు బ్యాంకు ఉద్యోగులు నిరసన చేపట్టారు. 400 మందికి పైగా ఉద్యోగులు పాల్గొని బ్యాంకుల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యుఎఫ్‌బియు కన్వీనర్‌ ఇ.నాగరాజు మాట్లాడారు. బ్యాంకుల ప్రయివేటీకరణ కార్పొరేట్ల లాభం కోసమేనన్నారు. ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న రూ.4లక్షల కోట్లపై కార్పొరేట్ల కన్ను పడిందని, ఆ మొత్తాన్ని కాజేసేందుకే బ్యాంకుల ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాయని అన్నారు. ఈ కుట్రను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బ్యారకులకు రూ.లక్షల కోట్లను ఎగ్గొట్టిన సంస్థలపై, వ్యక్తులపై చర్యలు చేపట్టకుండా, బ్యాంకుల్లో పేరుకుపోయిన అప్పులను బ్యాడ్‌ బ్యాంక్‌ పేరుతో బదలాయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. బ్యాంకుల ప్రయివేటీకరణను ఉప సంహరించుకునేంత వరకూ పోరాడతామన్నారు. ఎఐబిఇఎ జిల్లా అధ్యక్షులు రోజామణి, ఎఐబిఒసి నాయకులు మునీశ్వరయ్య, ఎఐబిఒఎ నాయకులు విజయ భాస్కర్‌, ఎన్‌సిబిఇ నాయకులు శ్రీకాంత్‌, ఎఐబిఇఎ నాయకులు ఎల్లయ్య, శివకృష్ణ, సతీష్‌ కుమార్‌ రెడ్డి, రాముడు, అనిల్‌, ఎపిజిబి ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు హనుమంత రెడ్డి పాల్గొన్నారు.