Nov 26,2020 20:41

న్యూఢిల్లీ : అఖిల భారత సమ్మెలో భాగంగా అనేక చోట్ల బ్యాంక్‌ ఉద్యోగులు చురుకుగా పాల్గన్నారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో నగదు లావాదేవీలు స్తంబించాయి. బ్యాంకింగ్‌ ఉద్యోగుల యూనియన్లు ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన లభించడంతో అనేక బ్యాంక్‌ శాఖల్లో డిపాజిట్లు, ఉపసంహరణలు, మారకం, ప్రభుత్వ లావాదేవీలు ప్రభావితం అయ్యాయి. గురువారం నాటి అఖిల భారత సమ్మెకు బిఎంఎస్‌ మినహా మిగితా అన్ని కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సమ్మె నేపథ్యంలో లావాదేవీల్లో ఇబ్బందులు ఉండొచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ముందుగానే తమ ఖాతాదారులకు సమాచారం ఇచ్చింది. సమ్మెలో బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (బెఫీ), ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ (ఎఐబిఇఎ), ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఎఐబిఒఎ) పాల్గన్నాయి. కాగా ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫిడరేషన్‌ (ఎఐబిఒసి) సమ్మెకు మద్దతును ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ప్రయివేటీకరణ, కార్మిక చట్టాల మార్పులు, ఆర్‌బిఐ అధికారాల కోతలను నిరసిస్తూ అనేక చోట్ల ఆందోళనలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని డిసిసిబి బ్యాంక్‌లు, గ్రామీణ బ్యాంక్‌లు, వాణిజ్య బ్యాంక్‌ల వద్ద ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. హైదరాబాద్‌లోని ఆర్‌బిఐ రీజినల్‌ కార్యాలయం ముందు, సెంట్రల్‌ బ్యాంక్‌ స్ట్రీట్‌, పాత ఆంధ్రా బ్యాంక్‌ ముందు ధర్నాలు, నిరసనలు చేపట్టారు.

కార్పొరేట్ల ఆసక్తుల కోసమే : ఎఐబిఇఎ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ.. అదే విధంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల ప్రయివేటీకరణను ఆపివేయాలని, ఈ రంగంలో అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని ఎఐబిఇఎ జనరల్‌ సెక్రటరీ సిహెచ్‌ వెంకటాచలం తెలిపారు. ఇటీవల జరిగిన లోకసభ సమావేశాల్లో కార్పొరేట్ల సులభ వ్యాపారాల కోసం 27 చట్టాలను రద్దు చేసి మూడు కొత్త చట్టాలను రూపొందించారన్నారు. దీని వల్ల 75 శాతం మంది కార్మికుల హక్కులకు భంగం వాటిళ్లనుందని ఆందోళన వ్యక్తం చేశారు.

విదేశీ బ్యాంక్‌లకు అప్పగించే కుట్ర : బెఫీ
భారత బ్యాంక్‌లను విదేశీ శక్తులకు అప్పగించే కుట్ర జరుగుతుందని బెఫీ వైస్‌ ప్రెసిడెంట్‌ పి వెంకటరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ను సింగపూర్‌కు చెందిన డిబిఎస్‌లో విలీనం చేయడమంటే భారత బ్యాంక్‌లను విదేశీమయం చేయడమేనని అన్నారు. ఆర్‌బిఐ ప్రతిపాదించిన కార్పొరేట్‌ బ్యాంక్‌ల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆర్‌బిఐకు ఉన్న పర్యవేక్షణ అధికారులను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఆర్‌బిఐ అధికారాలు పెంచడం ద్వారా బ్యాంక్‌లను పటిష్టం చేయడానికి వీలుందని.. కానీ ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహారిస్తుందన్నారు.