Oct 27,2021 18:22

ప్రజాశక్తి - ఏలూరు
         బ్యాంకింగ్‌ సేవలను మారుమూల ప్రాంతాలకు విస్తరించి ఆర్థిక పరిపుష్టికి తోడ్పడాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ కార్తికేయమిశ్రా బ్యాంకర్లను కోరారు. స్థానిక సిఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో బుధవారం జిల్లా లీడ్‌బ్యాంకు సమన్వయంతో జిల్లాలోని అన్ని బ్యాంకులతో నిర్వహించిన రుణ వితరణ మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేశారు. సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో డిజిటల్‌ లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి వారికి సేవలందించడం ద్వారా ఆర్థిక పరిపుష్టి ఏర్ప డుతుందన్నారు. జిల్లాలో మూడు నెలలుగా ఆర్‌బికెల స్థాయికి బ్యాంకు కరస్పాండెంట్లు వెళ్లి రైతులు రుణాలు పొందేందుకు సహకారం అందించడం గొప్ప పరిణా మమన్నారు. గత ఖరీఫ్‌ సీజన్‌లో సిసిఆర్‌సి కార్డుల ద్వారా రూ.152 కోట్లు కౌలుదారులకు రుణాలను అందజేయగా, ఈ సంవత్సరం రూ.190 కోట్లు అంద జేశామని అన్నారు. స్పల్వ, దీర్ఘకాలిక రుణాలుగా రూ.6,500 కోట్లు అందజేశామన్నారు. అన్ని బ్యాంకులు ఒకేచోట తమ సర్వీసులు, వడ్డీ రేట్లు, రుణాలు పొందేం దుకు సమాచారం తెలియజేయడంతో వినియోగ దారులు కావాల్సిన బ్యాంకును ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటుగా ఉంటుందన్నారు. లీడ్‌బ్యాంకు కన్వీనర్‌ ఐఎస్‌ఎన్‌.మూర్తి మాట్లాడుతూ సాధారణ ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలను మరింత చేరువ చేయడమే రుణవితరణ మహోత్సవ ముఖ్యోద్దేశమన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని అన్ని బ్యాంకులూ కలిపి జిల్లాలో రూ.699 కోట్ల రుణాలను మంజూరు చేశాయన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు మంజూరుచేసిన రుణాలు రు.699 కోట్లు, పిఎంఇజిపి, ముద్రా, స్టాండప్‌ ఇండియా పథకాలు కింద రూ.110 కోట్లు, ఎపిటిడ్కో రూ.26 కోట్లు, లీడ్‌బ్యాంకు అయిన యూనియన్‌ బ్యాంకు ఎస్‌హెచ్‌జిలకు అందించిన రూ.60 కోట్లు రుణాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్‌ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందచేశారు. తొలుత కలెక్టర్‌ సిఆర్‌ఆర్‌ డిగ్రీ కాలేజి ఆడిటోరియం వెలుపల వివిధ బ్యాంకులు, డిఆర్‌డిఎ స్టాల్స్‌ను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో లీడ్‌బ్యాంక్‌ జిల్లా మేనేజర్‌ ఎస్‌ఎస్‌ఎ.వెంకటేశ్వరరావు, యూనియన్‌ బ్యాంకు ఎఫ్‌జిఎం కెఎస్‌ఒఎస్‌వి.ప్రసాద్‌, డిజిఎం దుండీశ్వరరావు, ఎస్‌బిఐ డిజిఎం కె.రంగరాజన్‌, యుబిఐ డిజిఎం ఎం.రామారావు, ఎజిఎం జివి.రావు, సెంట్రల్‌ బ్యాంకు డిజిఎం తెరెమ్‌ సింగ్‌ జిరె, ఎజిఎం వై.శంకరరావు, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీనివాసరావు, డిఐసి జిఎం వెంకట్రావు, నాబార్డు డిడిఎం టి.అనిల్‌కాంత్‌, డిసిసిబి సిఇఒ శ్రీదేవి, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.