
కడపఅర్బన్ బుగ్గవంక బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, వరకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ హరికిరణ్‌కు ఆయన ఛాంబర్లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సిపిఎం నగర కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్, కడప నియోజకవర్గ ఇన్ఛార్జీ అమీర్‌బాబు, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాసరావు, బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు గుర్రప్ప, హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సి.ఆర్.వి.ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. బుగ్గవంక డ్యామ్ నుంచి 19వేల క్యూసెక్కుల నీరు వంకలోకి వదలడం మానవ తప్పిందన్నారు. పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వరద బాధితులు సర్వం కోల్పోయారని చెప్పారు. వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పేరుకుపోయిన బురదను యుద్దప్రతిపదికన శుభ్రం చేయాలని తెలిపారు. నరగంలో వంకలు, వాగులు, కల్వర్టులు, కట్టలు, డ్రైయినేజిలు ఆక్రమించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. నగర శివార్లలో ఉన్న చెరువులకు గండిపడకుండా చూడాలని పేర్కొన్నారు.