Oct 12,2020 16:06
బతుకు కథలకు బ్లూ క్లబ్‌!

ప్పుడు చెన్నై నగరాన్ని వరద ముంచెత్తింది! ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు ఎవరి జీవితాలు ఛిద్రమవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బడుగు వర్గాలు, అణగారిన జనాలే బాధితులక్కడ. అప్పుడు జర్నలిస్టుగా ఉన్న ప్రియ దర్శిని పళని వారి జీవితాల్ని దగ్గర నుంచి చూశారు. వారాల తరబడి ఆ మహిళల బతుకుకోణాల్ని నిశితంగా పరిశీ లించా రు. అణగదొక్కబడిన వర్గాల మహిళల గొంతుక మూగబోతే ఎన్ని జీవిత కథలు మరుగునపడతాయో ఆమెకు అర్థమైంది. అందుకే 'ది బ్లూ క్లబ్‌' అనే సంస్థను ఏర్పాటు చేశారామె.


ఇది చాలామందికి సుపరిచితమైన చిత్రం... ''మురికివాడల్లో వాటర్‌ ట్యాంక్‌ వచ్చిందంటే చాలు.. ఆడోళ్లంతా బిందెలు పట్టుకొని పరుగెడుతారు. క్యూలో పెట్టిన బిందెల దగ్గరో... నీటిని పట్టే ట్యాప్‌ దగ్గరో... జుట్టులు పట్టుకొని వీరంగం ఆడతారు.''. ఇది చాలా సినిమాల్లోనే కాదు, ఎన్నో సందర్భాల్లో కామెడీ ట్రాక్‌గా పనిచేసే సందర్భం. కానీ నీళ్ల ట్యాంక్‌ దగ్గర పడిగాపులు పడే మహిళలకు అది ఒక నిరాశ, నిస్పృహల వేదనని ఎంతమంది గుర్తిస్తారు? ఆ రోజు ఇంట్లో నీరు లేకపోతే ఎలా గడపాల్సి వస్తుందో.. కదా? ఇలా కనీస సౌకర్యాలకు దూరంగా బతికే బతుకుల్లో ప్రతి దశా ఒక ఫజిల్‌. ప్రతిరోజూ ఒక యుద్ధం. సరిగ్గా ఈ బతుకు వెతలే ప్రియదర్శినీని ప్రేరేపించాయి. 'ది బ్లూ క్లబ్‌' ప్రారంభించడానికి కారణమయ్యాయి. వారి జీవితాలను వారే చిత్రాలుగా మలచడానికి ఈ వేదిక, ఒక అవకాశం. ఫిల్మ్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌లు నిర్వహించడంతో పాటు అణగారిన వర్గాలకు చెందిన మహిళ జీవిత కథలను, జీవన గమనాలను ఇక్కడ డాక్యుమెంట్‌ చేస్తారు.


ఆమె అనుభవం
చెన్నైకి చెందిన ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌, ఫిల్మ్‌మేకర్‌ అయిన ప్రియదర్శిని ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశారు. తర్వాత ఏషియన్‌ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం చదివారు. ఉన్నత విద్యను పూర్తిచేసుకున్న ఆమె 'ఇండియా టుడే' వంటి మీడియా సంస్థల్లో కొన్నాళ్లు పనిచేశారు. ఆ తర్వాత ఆమె పూర్తిస్థాయి ఫిల్మ్‌మేకర్‌గా మారాలని నిశ్చయించుకున్నారు. అణగారిన కులాలతో పాటు.. సమాజంలో జెండర్‌ కోణాలపై చిత్రాలు రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆమె వివిధ లఘు చిత్రాలు, డాక్యుమెంటరీలను తీశారు. వీటిలో 19వ శతాబ్దానికి చెందిన ఉద్యమ కారిణి. స్త్రీవాద సంఘసంస్కర్త సావిత్రిభారు ఫూలే జీవితం ఆధారంగా తీసిన 'గో, గెట్‌ ఎడ్యుకేషన్‌' కూడా ఒకటి. అలాగే హర్యానాలో దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై 'దళిత్‌ ఉమెన్‌ ఫైట్‌' అనే చిత్రం నిర్మించారు. ఆ తర్వాత ఆల్‌ ఇండియా దళిత్‌ మనిలా అధికార్‌ మంచ్‌తో కలిసి ఆమె నిర్మించిన చిత్రాన్ని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కౌన్సి ల్లోనూ ప్రదర్శించారు. ప్రియదర్శిని 'ది బ్లూ క్లబ్‌' నిర్వహించ డంతో పాటు 'ఖైదే-మిల్లెత్‌ ఇంటర్నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ మీడియా స్టడీస్‌'లో గెస్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. అంతకు మించి, 'స్త్రీ ఇలాగే ఉండాలి' అని సమాజంలో బలపడిన అభిప్రాయాన్ని బద్ధలు చేసేందుకు కృషి చేస్తున్నారు.


కథలుగా నిక్షిప్తం
'ది బ్లూ క్లబ్‌' లో ఫిల్మ్‌ మేకింగ్‌ వర్క్‌షాపులతో పాటు మహిళలు తమ కథల్ని తామే రాసుకోవడానికి ప్రోత్సహిస్తుం టారు. దానికోసం రైటింగ్‌ వర్క్‌షాపుల్ని నిర్వహిస్తారు. నిజానికి రోజువారీ కూలి చేసుకునే ఈ మహిళలు ఒకరోజు పని మానుకొని, వర్క్‌షాపుకు హాజరు కావడమంటే ఒకరోజు కూలి డబ్బుల్ని పోగొట్టుకోవడమే. అయినా వారి కథలు అంతకుమించిన విలువగలవిగా ప్రియదర్శిని భావిస్తారు. ఆ కథలు సమాజానికి తెలియా లంటారు. దళిత మహిళల అభివృద్ధికి తోడ్పడేందుకు ఈ క్లబ్‌ క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా విరాళాలు సేకరిస్తారు. 15 నుంచి 25 ఏళ్ల వయసున్న మహిళలకి ఈ వర్క్‌షాపులు నిర్వహించి, కథారచనలో, ఫిల్మ్‌ మేకింగ్‌లో వారిని ప్రోత్సహిస్తారు. దీనికోసం క్లబ్‌ సభ్యులు మూడు నెలల పాటు సదరు మురికివాడలోనే నివసిస్తారు. అక్కడ మహిళలకు ఖాళీ సమయం ఉన్నప్పుడు అందరికీ అనువైన స్థలంలో వర్క్‌షాప్‌ నిర్వహిస్తారు. దళిత మహిళలు అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తున్నారు ప్రియదర్శిని. ఇప్పుడు 'ది బ్లూ క్లబ్‌' నిర్వహించే కార్యక్రమాలు ఎంతోమంది అణగారిన బతుకుల్లో ఆశలు నింపుతోంది. రేపటి తరాల కోసం నేటి తమ జీవితా లను కథలుగా నిక్షిప్తం చేయడానికి సహకరిస్తోంది.

మహిళలకు ఫెలోషిప్‌ కార్యక్రమం
'ది బ్లూ క్లబ్‌' ఈ మధ్యనే ఒక ఫెలోషిప్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా దళిత మహిళలు, క్వీర్‌ వ్యక్తుల కోసం కేటాయించబడింది. దేశంలో ఇలాంటి ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌ మొదటిదని చెప్పొచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 15 మందిని ఎంపిక చేసుకుంటారు. నవంబరు మధ్య నుంచి ప్రారంభమయ్యే మూడు నెలల ఈ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌కు రూ. 30 వేల వేతనం అందిస్తారు. ఈ ఫెలోషిప్‌ ప్రోగ్రామ్‌కి అప్లై చేసుకోవడానికి 2020, అక్టోబర్‌ 10 చివరి తేది. దీనికోసం 'ది బ్లూక్లబ్‌.ఓఆర్‌జి' అనే వెబ్‌సైట్‌ సందర్శించాలి.