
ఎచ్చెర్ల మండలం నారాయణపురం కొండ విషయంలో అంతా ఒక్కటయ్యారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు అక్రమార్కులకు అండగా నిలిచారు. అక్రమార్కులకు ఎచ్చెర్ల నియోజకవర్గ వైసిపి నాయకులు తోడవ్వడంతో మరింత బరితెగిస్తున్నారు. తరతరాలుగా రైతుల సాగులో ఉన్న ప్రభుత్వ భూముల్లోకి చొరబడి యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. అడిగే వారు లేకపోవడంతో చెలరేగిపోతున్నారు. దళితులు, నిరుపేదలకు చెందిన పచ్చని తోటలను ధ్వంసం చేస్తున్నారు. అన్యాయాన్ని అడ్డుకోవాలని ఉన్నతాధికారులకు విన్నవించినా చర్యలు కానరావడం లేదు.
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలోని నారాయణపురం కొండపై చిలకపాలెంకు చెందిన దళితులు, నిరుపేదలు తరతరాలుగా జీడి, నీలగిరి, నేరడి తదితర పంటలను సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లోనే అధికారులు ప్రస్తుతం గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. గ్రావెల్ తవ్వకాల కోసం రెవెన్యూ అధికారులు ఇచ్చిన నిరభ్యంతర పత్రం వివాదాస్పదమవుతోంది. చిలకపాలెం గ్రామానికి చెందిన బి.ఈశ్వరరావుకు నారాయణపురం రెవెన్యూ గ్రామ సర్వే నంబరు 1-2లో 15 ఎకరాల్లో లక్ష క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను తవ్వుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని మైనింగ్ అధికారులకు ఎన్ఒసి (నో అబ్జక్షన్ సర్టిఫికేట్) పంపారు. సబ్ డివిజన్ల విలీనానికి ముందు సర్వే నంబరు 1లో మొత్తం 49 ఎకరాల 20 సెంట్లు ఉన్నట్లు ఎన్ఒసిలో పేర్కొన్నారు. అనంతరం దాని విస్తీర్ణం 67.06 సెంట్లకు పెరిగి, సర్వే నంబరు 1-2లో కొండపోరంబోకు నుంచి ఇనాం మెట్టుగా పొందుపరిచారు. భూముల వర్గీకరణకు సంబంధించి సెటిల్మెంట్ అధికారి ఎటువంటి ఉత్తర్వులు పేర్కొన్నందున, అందుబాటులో రికార్డులో లేనందున యాజమాన్య హక్కుదారులను నిర్ధిష్టంగా పేర్కొనలేకపోతున్నామని ఎన్ఒసిలో పొందుపరిచారు. ప్రస్తుతం భూస్థితి గ్రావెల్‌తో ఉన్న కొండగా ఉందని పేర్కొన్నారు. కొండపై తనకున్న 16 ఎకరాల్లో ఎనిమిది ఎకరాల్లో గ్రావెల్ తవ్వకాలకు అంధవరపు అప్పారావు అంగీకరించారంటూ గనులు, భూగర్భశాఖ అధికారులకు తెలియజేశారు. అందులోనే అంధవరపు గోవిందరాజులు అతని కుమారులు వెంకటఅప్పారావు, కృష్ణారావు, రామారావు, లక్ష్మణరావు తదితరులకు 51.56 ఎకరాల భూమి ఉన్నట్లుగా పేర్కొన్నారు. వారికి భూముల కట్టబెట్టడంలో ఎటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయో తెలిసిందే.
ఎన్ఒసి జారీలో అనేక అనుమానాలు
ఎచ్చెర్ల మండల తహశీల్ధార్ ఇచ్చిన ఎన్ఒసి అనేక అనుమానాలకు దారి తీస్తోంది. నారాయణపురం కొండపై చిలకపాలెం గ్రామానికి చెందిన దళితులు, నిరుపేదలు నీలగిరి, జీడిమామిడి తదితర తోటలను సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం భూస్థితిని గ్రావెల్‌గా పేర్కొనడం విస్మయానికి గురిచేస్తోంది. భూముల వర్గీకరణకు సంబంధించి సెటిల్మెంట్ అధికారి ఎటువంటి ఉత్వర్వులు ఇవ్వలేదని, అందుబాటులో రికార్డు లేవని ఎన్ఒసిలో పేర్కొని అంధవరపు గోవిందరాజులకు అతని కుమారులకు చెందినవిగా ఎలా తేల్చారో అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. రికార్డులు లభ్యం కాకపోతే తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతులకు చెందినవిగా ఎందుకు పేర్కొనలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే అనుమతులు
క్వారీ తవ్వకాల విషయంలో గనులు, భూగర్భశాఖ అధికారులు కేవలం ఎచ్చెర్ల మండల తహశీల్దార్ ఇచ్చిన ఎన్ఒసిపైనే ఆధారపడి అనుమతులు ఇచ్చినట్లు కనిపిస్తోంది. కొండపై జీడిమామిడి, నీలగిరి, నేరడు తదితర తోటలు ఉన్నా, ఏమీలేవని రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదికనే పరిగణనలోకి తీసుకున్నారు. కొండపై ఎంత మేర తవ్వకాలు జరపుకోవచ్చో కనీసం హద్దులు కూడా నిర్ణయించలేదు. ఇప్పుడు దీనినే ఎచ్చెర్ల తహశీల్దార్ అవకాశంగా తీసుకుంటున్నారు. తాము కొండ కింది భాగంలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులిచ్చామని, కొండపైన తవ్వుతున్నారంటే అది గనులు భూగర్భశాఖ అధికారులే చూసుకోవాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అక్రమ తవ్వకాలకు అండగా వైసిపి నేతలు
అక్రమ తవ్వకాలు, ప్రభుత్వ భూములను ఓ వ్యాపారి కుటుంబానికి దఖలుపరచడం వెనుక ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజకవర్గ వైసిపి ముఖ్య నేతల హస్తమున్నట్లు తెలుస్తోంది. భూముల కేటాయింపు, గ్రావెల్ తవ్వకాలకు అనుమతుల విషయంలో సాధారణంగా అధికారులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ నారాయణపురం కొండ విషయంలో అన్ని నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటే నియోజకవర్గానికి చెందిన వైసిపి ముఖ్యనేత సిఫార్సులు, ఒత్తిళ్లే కారణమనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. గ్రావెల్ తవ్వకాలు పూర్తయిన తర్వాత అక్కడి భూమిని చదును చేసి రియల్ ఎస్టేట్‌గా మార్చాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ముఖ్య నేత పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వ్యాపారి కుటుంబానికి భూములు దఖలుపరచడంలో ఆ నేత సహకరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఎమ్మెల్యేలు ఒకరి నియోజకవర్గ వ్యవహారాల్లో వేరొకరు వేలు పెడితే సహించరు. కానీ ఎచ్చెర్ల నియోజకవర్గంలోని నారాయణపురం కొండ విషయంలో రెండు నియోజకవర్గాలకు చెందిన వైసిపి నాయకులు అందరూ సర్దుకుపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అధికారులు, అధికార పార్టీ నాయకులు ఒక్కటైనా తమ భూములు తాము దక్కించుకునే వరకు పోరాటం ఆపేది లేదని రైతులు తేల్చి చెప్తున్నారు.
రైతుల భూములను కాజేయాలని చూస్తున్నారు
అధికారులు, వైసిపి నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై రైతుల సాగులో ఉన్న ప్రభుత్వ భూములు కాజేయాలని చూస్తున్నారు. తప్పుడు పత్రాలతో అధికారులు ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులిచ్చారు. ప్రభుత్వ భూముల్లో రైతులు సాగు చేసుకుంటున్న తోటలను ధ్వంసం చేయడం అన్యాయం. తక్షణమే ప్రభుత్వ, ప్రయివేట్ భూములకు హద్దులను నిర్ణయించి రైతుల పంటలను కాపాడాలి.