Jan 08,2021 20:56

అమరావతి బ్యూరో : బర్డ్‌ ఫ్లూ వ్యాధి వ్యాపిస్తోందన్న వార్తలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విజయవాడలో వ్యాధి నిర్ధారణ కేంద్రాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 829 వైద్య బృందాలను సిద్ధం చేసింది. ఒక్కో బృందంలో ఒక పశువైద్యుడు, ఇద్దరు పారా వెటర్నరీ సిబ్బంది, ఇద్దరు సహాయకులు ఉంటారు. వీటితో పాటుగా ప్రతీ జిల్లాలోనూ ఉన్న కోళ్ల సంఖ్యను బట్టి 40 నుంచి 140 బఅందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. వలస పక్షలు వచ్చే నెల్లూరు, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో అదనంగా ప్రత్యేక బఅందాలను ఏర్పాటు చేస్తున్నారు. బెంగుళూరులో ఏర్పాటైన దక్షిణ భారత ప్రాంతీయు పశువ్యాధి నిర్ధారణ కేంద్రంలో బర్డ్‌ ఫ్లూ వ్యాధి నిర్ధారణ, నివారణ, నిరోధకతపై శిక్షణ పొందిన ఐదుగురు సిబ్బందిని విజయవాడ కేంద్రంలో నియమించారు.విజయవాడలోని విజయవాడ గన్నవరంలోని పశువ్యాధి పరిశోధనా కేంద్రంలోనే బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. విజయవాడలో ఏర్పాటైన ఈ పశువ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో రక్త, విసర్జన సమూనాలను పరిక్షిస్తారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని కొల్లిపర, శ్రీకాకుళం జిల్లాలో చనిపోయిన కాకుల నుండి సేకరించిన నమూనాలను విజయవాడలోని పశువ్యాది పరిశోధనా కేంద్రంలో పరీక్షించి బర్డ్‌ ఫ్లూ లేదని నిర్ధారించారు. పశుసంవర్ధక శాఖతో పాటు అటవీశాఖ సిబ్బందికి బర్డ్‌ ఫ్లూ వ్యాధి సన్నద్ధతపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ అనంతరం ఈ రెండు శాఖల సిబ్బందీ పంచాయతీ రాజ్‌ శాఖ సిబ్బందితో కలిసి పౌల్ట్రీ రైతులకు, వ్యాపారులకు ఈ వ్యాధిపై అవగాహన కల్పించనున్నారు. ప్రతి జిల్లాల్లోనూ పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకుని కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు ఉడికించిన కోడి గుడ్లు, మాంసం తినడం ద్వారా బర్డ్‌ ఫ్లూ రాదని వైద్యులు చెబుతున్నారు.