Dec 05,2021 18:29

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షుడు వి.ఏసురత్నం

బోర్డు నిధులను కార్మికులకే ఖర్చు చేయాలి : సిఐటియు
ప్రజాశక్తి - ఆత్మకూర్‌

భవన, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం ప్రకారం బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమం కోసమే అమలు చేయాలని, వెల్పేర్‌ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను ఆపుతూ ఇచ్చిన మెమో 12, 14లను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు వి.ఏసురత్నం, పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్‌, ఏపి బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి బాలవెంకట్‌, పట్టణ అధ్యక్షులు జి.నాగేశ్వరరావు, కార్యదర్శి షేక్‌ ఇస్మాయిల్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2007 నుంచి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నాయకత్వంలో బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ప్రారంభించారని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. వేలాది మందికి లబ్ధి చేకూర్చారని చెప్పారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్‌ బోర్డు ఉందన్న భరోసాతో ఉన్నారని, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆదేశానుసారం బిల్డింగ్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు జరగవని సాక్షాత్తు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌ మెమో నంబర్‌ 12 14లను జారీ చేయడం అన్యాయమన్నారు. ఇతర అవసరాలకు నిధులు వాడకూడదని స్పష్టంగా ఉందని, తెలుగుదేశం ప్రభుత్వం వెల్ఫేర్‌ బోర్డు నిధులు చంద్రన్న బీమా వాడిన సందర్భంగా బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయని, ఆ సందర్భంగా ఆనాటి ప్రతిపక్షనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి గత ప్రభుత్వ చర్యలను తప్పు పట్టారన్నారు. భవన నిర్మాణ కార్మికుల ఆందోళనలో పాల్గొని మద్దతు ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ బీమాకు రూ. 385 కోట్లు, మిగులు నిధులు అనే పేరుతో 450 కోట్లు బిల్డింగ్‌ వెల్ఫేర్‌ వర్కర్స్‌ బోర్డు దారి మళ్లించారన్నారు. చట్టవ్యతిరేకంగా తరలించిన బిల్డింగ్‌ వెల్ఫేర్‌ బోర్డు నిధులను పునరుద్ధరించి సంక్షేమ పథకాలకు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మికులకు కిట్లు ఇవ్వాలని, ఇసుక డంపుయార్డ్‌ ఏర్పాటు చేయాలన్నారు. లేబర్‌ కార్డు ఉన్న ప్రతి కార్మికుని పిల్లలకు స్కాలర్షిప్‌, పెళ్లిళ్లకు డబ్బులు ఇవ్వాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికునికి 3 వేలు పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ముక్తియార్‌, మూర్తుజా, అలీ, జబిల్లా, అమానుల్లా, ఫారూక్‌, నూర్‌ అహమ్మద్‌, ఇస్మాయిల్‌, వలి, గఫార్‌, ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.