Oct 28,2021 07:54

బ్రసీలియా : మానవాళి పట్ల నేరాలతో సహా వివిధ నేరాలకు అధ్యక్షుడు జేర్‌ బోల్సనారో పాల్పడ్డారంటూ సెనెటర్‌ రీనన్‌ కేల్‌హెయిర్స్‌ ప్రతిపాదించిన అభిశంసన తీర్మానానికి బ్రెజిల్‌ సెనెట్‌ మద్దతు తెలిపింది. సెనెట్‌కి చెందిన పార్లమెంటరీ దర్యాప్తు కమిషన్‌ (సిపిఐ) మంగళవారం దీనిపై తుది నివేదికను ఆమోదించింది. దాదాపు ఆరు మాసాలుగా ఈ తీర్మానంపై చర్చ జరిగింది. తుది నివేదికకు అనుకూలంగా ఏడు ఓట్లు, వ్యతిరేకంగా నాలుగు ఓట్లు వచ్చాయి. దేశంలో వేలాదిమంది మరణానికి కారణమైన కోవిడ్‌ మహమ్మారిని సమర్ధవంతంగా అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ అధ్యక్షుడు, ఇతర ప్రభుత్వాధికారులను నివేదిక విమర్శించింది. సెనెట్‌ ఆమోదించడంతో ఇక దర్యాప్తు కమిషన్‌ పని పూర్తయిందని, మానవాళి పట్ల బోల్సనారో నేరాలతో సహా వివిధ నేరాలకు సంబంధించిన నివేదికలను సంబంధిత సంస్థలకు పంపాలని సెనెట్‌ అధ్యక్షుడు ఒమర్‌ అజీజ్‌ తెలిపారు. ముందస్తు నివారణా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, ఫలితంగా విషాదం చోటు చేసుకుందని, ప్రభుత్వ వనరులు దుర్వినియోగం జరగడంతో సహా పలు నేరాలకు బోల్సనారో పాల్పడ్డారని ఆ నివేదిక పేర్కొంది.