Oct 03,2021 13:35

ఈ భూ ప్రపంచంలో వింతైన మొక్కలు ఉన్నట్లుగానే.. వినూత్నమైన పూలూ ఉన్నాయి. అయితే వాటిలో చాలా వరకూ మనం ఎప్పుడూ చూసేందుకు అవకాశం ఉండకపోవచ్చు. ఒక్కో రకం పూలు ఒక్కో ప్రాంతంలో పూస్తూ ఆకర్షణగా నిలుస్తుంటాయి. ఇవి చూడ్డానికి అచ్చం పూలలా కనిపించినా.. నిజంగా ఇవి మొక్కలకు పూసినవేనా..? లేక ప్లాస్టిక్‌ బొమ్మలా? అనిపించేలా అబ్బురపుస్తుంటాయి. అయితే అలాంటి కొన్ని వింత ఆకారాల్లో పూచే పూల గురించి తెలుసుకుందాం.


                                                                 టోపీల మొక్క

బొమ్మల్లా విడ్డూరమైన పూలు !

ఈ పూలు అచ్చం టోపీల మాదిరిగానే ఉంటాయి. పైభాగం లేత నీలం, లోపలి భాగం పసుపు రంగులో ఉంటుంది. మధ్యలో ఉండే చుక్కల డిజైన్‌ చూడచక్కగా ఉంటుంది. పూలు మెత్తగా ఉండి, మింట్‌ సువాసనలు వెదజల్లుతాయి. తొలుత గులాబీ మొగ్గల్లా వచ్చి, తరువాత టోపీల్లా విచ్చుకుంటాయి. ఈ పువ్వులు వారం రోజుల వరకూ నిగారింపుగా ఉంటాయి. ఆకులు సన్నగా, ఆకుపచ్చగా ఉంటాయి. దీని శాస్త్రీయ నామం 'జోవెల్లనా పంక్టాటా'. 'టీ కాప్‌ ఫ్లవర్‌' అని కూడా పిలుస్తారు. ఇది కాల్సియాలేరియేసి కుటుంబానికి చెందింది. ఒకటిన్నర మీటర్ల ఎత్తు వరకూ పెరిగే ఈ మొక్క గుత్తులు గుత్తులుగా పూలు పూస్తుంది. సూర్యకిరణాలు పడే చోట మొక్క బాగా పెరుగుతుంది. న్యూజ్‌లాండ్‌ పరిసర ప్రాంతాల్లో విరివిగా కనిపిస్తుంది.
 

                                                                  మిక్కీమోస్‌ పూలు

బొమ్మల్లా విడ్డూరమైన పూలు !

వేల రకాలున్న ఆర్కిడ్‌ జాతి పూల మొక్కల్లో మిక్కీమోస్‌ పూల మొక్క ఒకటి. చక్కగా పువ్వు విప్పారుతుంది. దానిలోపల అచ్చంగా మిక్కీమోస్‌ బొమ్మలాంటి మరో పువ్వు విచ్చుకుంటుంది. చూడ్డానికి రంగు రంగులతో ఈ పువ్వు ప్లాస్టిక్‌ బొమ్మ మాదిరిగానే ఉంటుంది. దీని శాస్త్రీయనామం 'ఓఫ్రిస్‌ ఉంబిలికాటా'. ఈ పూలు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పూస్తాయి. టర్కీ, సిరియా, ఇజ్రాయిల్‌ దేశాలు వీటి మాతృభూమి. మొక్క 10 నుంచి 20 అంగుళాలు పెరుగుతుంది. పువ్వు నెల వరకూ విచ్చుకునే ఉంటుంది. ఇన్డోర్‌, సెమీషేడ్‌లో ఇది పెరుగుతుంది.
 

                                                               లేడీస్‌ బూట్ల మొక్క

Strange flowers like dolls!

పసుపు రంగులో ఆడవారి బూట్ల ఆకారాన్ని పోలి వుంటుంది ఈ పువ్వు. దీని శాస్త్రీయనామం 'సైప్రిపెడియం పర్విఫ్లోరం'. సాధారణంగా 'లేడీ స్లిప్పర్‌' లేదా 'మొకాసిన్‌ ఫ్లవర్‌' అని పిలుస్తారు. ఇది ఉత్తర అమెరికాకు చెందిన ఆర్చిడ్‌. ఇది అలస్కా దక్షిణం నుండి అరిజోనా, జార్జియా ప్రాంతాల్లో విస్తృతంగా పెరుగుతుంది. ఔట్‌ డోర్‌, సెమీషేడ్‌ ప్రాంతాల్లో పెరుగుతుంది. ఆకులు దీర్ఘవృత్తాకారంగా ఉంటాయి. మొవ్వ భాగంలోంచి ఈ పూలు పూస్తాయి. ఇవి వారం రోజుల వరకూ ఉంటాయి. వీటిని కుండీల్లోనూ, నేల మీదా పెంచుకోవచ్చు.
 

                                                                  కోడిపిల్ల పువ్వు

బొమ్మల్లా విడ్డూరమైన పూలు !

కోడిపిల్ల గుడ్డు నుంచి పగిలి వచ్చినట్లు ఉంటుంది ఈ మొక్క పువ్వు. దీని శాస్త్రీయనామం 'యులాన్‌ మంగోలియాస్‌'. ముక్కు పసుపు రంగులో, కళ్లు నలుపు రంగులో, రెక్కలు లేత గులాబీ రంగులో ఉంటాయి. పైన డొప్ప తెలుపు, బూడిద రంగు మిశ్రమంలో చూడ్డానికి అచ్చంగా పక్షిలానే ఉంటుంది. పెద్ద పెద్ద వృక్షాలుగా పెరిగి, వసంతం రాగానే నిండుగా పూలు పూస్తుంది. ఇది చైనా దేశపు మొక్క. బౌద్ధ ఆలయాల్లో ఎక్కువగా ఈ మొక్కలు కనిపిస్తాయి.                                                             శ్వేత చిలుక పూలమొక్కల

బొమ్మల్లా విడ్డూరమైన పూలు !


ఇవి రేఖలు మాదిరిగా విచ్చుకుని, ఆహ్లాదకరంగా ఉంటాయి. చిలక ముక్కులాంటి ఆకారంలో తెలుపు రంగులో, అడుగున ఎర్రటి అంచుతో పువ్వు చూడ్డానికి భలే గమ్మత్తుగా ఉంటుంది. దీని శాస్త్రీయనామం 'సాల్వియా మైక్రోఫిలా'. ఇవి మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతాయి. మైక్రోఫిలా అంటే చిన్న ఆకులున్న మొక్క అని అర్థం. వసంత ఋతువు చివరిలోనూ, శరదృతువులోనూ పుష్పిస్తాయి. ఆకులు అండాకారంలో ఉంటాయి. ఇది దక్షిణ మెక్సికోకి చెందిన పర్వతాల్లో పెరుగుతుంది. వీటిని నేల మీద, కుండీల్లోనూ పెంచుకోవచ్చు.
 

                                                                       ఎగిరే పక్షులు

బొమ్మల్లా విడ్డూరమైన పూలు !

ఎగిరే శ్వేత కపోతాల్లాంటి పూలమొక్క 'ప్లాటంటేరా బ్లెఫారిగ్లోటిస్‌'. దీన్ని వైట్‌ ఫ్రింగ్డ్‌ ఆర్చిడ్‌ లేదా వైట్‌ ఫ్రింగ్డ్‌ ఆర్కిస్‌ అని పిలుస్తారు. ఆకు పచ్చని మొక్కకి తెల్లని పూలు అందాన్ని అద్దుతాయి. మూడున్నర అడుగుల ఎత్తు వరకూ పెరిగే ఈ మొక్క వసంత రుతువు చివర నుంచి వేసవి వరకూ పూస్తుంది. ఇది పూర్తిగా బయటి వాతావరణంలో పెరిగే మొక్క. కుండీల్లోనూ పెంచుకోవచ్చు. ఇది ఫ్లోరిడా ప్రాంతంలో విరివిగా కనిపిస్తుంది.
 

                                                              పీచుమిఠాయి పువ్వు మొక్క

బొమ్మల్లా విడ్డూరమైన పూలు !

మొక్క చూడ్డానికి అచ్చంగా ఒక పుల్లకు పీచుమిఠాయి చుట్టినట్లు వింతగా ఉంటుంది. దీని శాస్త్రీయనామం 'జియం రెప్టన్స్‌'. ఇది గులాబీ కుటుంబానికి చెందిన మొక్క. వాతావరణం పరిస్థితులను బట్టి వసంత ఋతువు చివరిలోనూ లేదా వేసవిలోనూ పూస్తుంది. పూలు వాడిపోయిన తరువాత గులాబీ రంగులో పీచులా మారుతుంది. ఐరోపాలోని పర్వత ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇవి బయటి వాతావరణంలో పెరిగే మొక్క.
 

                                                                     స్టార్‌ ఫిష్‌ ఫ్లవర్‌

బొమ్మల్లా విడ్డూరమైన పూలు !

ఈ పువ్వు చూడ్డానికి సముద్రంలో ఉండే స్టార్‌ ఫిష్‌లా ఉంటుంది. దీని శాస్త్రీయనామం 'స్టెపెలియా హిర్సుటా'. సాధారణ పేరు 'స్టార్‌ఫిష్‌ ఫ్లవర్‌' లేదా 'కారియన్‌ ప్లాంట్‌'. ఇది అపోసినేసి కుటుంబానికి చెందిన మొక్క. ఐదడుగుల వరకూ పెరుగుతుంది. ఆకులు కాకుండా కాక్టస్‌ మొక్కలా పొడవాటి ఆకుపచ్చని కాండాలు ఉంటాయి. అడుగు భాగం కుదుర్లోంచి ఈ పువ్వు విచ్చుకుంటుంది. గుండ్రంగా, చారలతో, బొడిపెలుతో, వెంట్రుకల్లాంటి పీచుతో, మధ్యలో నక్షత్రం వంటి పీచుతో ఎన్నో ఆకారాలు సంతరించుకుని ఉంటాయి. ఇది దక్షిణాఫ్రికాలోని యుఫోర్బియేసీ జాతి మొక్క. నీటి వనరు పెద్దగా అవసరం లేదు. పూర్తిగా బయటి వాతావరణంలో రాతి ప్రదేశంలోనూ పెరుగుతుంది.