Oct 25,2021 07:27
  • మొక్కలను తీసేసి కొత్తవి నాటుతున్న రైతులు
  • మిర్చి సాగుకు భారీగా పెరుగుతున్న పెట్టుబడులు


ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : గత కొన్నేళ్లుగా పత్తికి గిట్టుబాటు ధర లభించక ప్రత్యామ్నాయంగా ఈ ఏడాది రైతులు మిర్చి వైపు మొగ్గు చూపారు. మిర్చికి ఈ ఏడాది ఆదిలోనే సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా బొబ్బర తెగులు వెంటాడుతోంది. పైరు నిలదొక్కుకొని పూత దశకు వస్తున్న దశలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మిర్చికి బొబ్బర తెగులు ఆశించింది. దీంతో, అటువంటి మొక్కలను తొలగించి వాటి స్థానంలో మళ్లీ కొత్తగా మిర్చి మొక్కలను నాటుతున్నారు. దీంతో, పెట్టుబడి భారీగా పెరిగిపోతుండడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 3.50 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 4.60 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. గుంటూరు జిల్లాలో మిర్చి సాధారణ విస్తీర్ణం 1.60 లక్షల ఎకరాలు కాగా అత్యధికంగా ఈ ఏడాది 2.45 లక్షల ఎకరాల్లో వేశారు. ప్రకాశం జిల్లాలో లక్ష ఎకరాల్లో, కర్నూలులో 60 వేలు ఎకరాల్లో, కృష్ణా జిల్లాలో 40 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది రెండు లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు ఉపసంహరించుకోగా ఇందులో 85 వేల ఎకరాల్లో ఈ ఏడాది అదనంగా మిర్చి పంట వేశారు. మిగతా జిల్లాల్లోనూ స్వల్పంగా మిర్చి సాగు విస్తీర్ణం పెరిగింది. గుంటూరు జిల్లాలో మిర్చి సాగుకు ఎకరా ఒక్కంటికీ లక్ష నుంచి లక్షన్నర రూపాయల వరకు పెట్టుబడి అవుతోంది. మిర్చి విత్తనాలు నేరుగా నాటే పద్ధతిలో కొంతమంది సాగు చేయగా, మరికొంతమంది నారు కొనుగోలు చేసి నాటారు. మిర్చి మొక్కలను ఆయా రకాల కంపెనీలను బట్టి 70 పైసల నుంచి రూపాయిన్నర వరకు చెల్లించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు 40 వేల మొక్కల వరకు నాటుతారు. కేవలం మిర్చి మొక్కలకే రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అయింది. ఆర్మూరు రకం మిర్చి మొక్క గరిష్టంగా రూ.1.70 వరకు ధర పలుకుతోంది. ఈ ఏడాది ఆదిలోనే మిర్చి పైరుకు బొబ్బర తెగులు రావడంతో రైతులు పెట్టిన పెట్టుబడి వృథాగా పోతుందని ఆందోళన చెందుతున్నారు. మేడికొండూరు, సత్తెనపల్లి, ఫిరంగిపురం, ముప్పాళ్ల తదితర మండలాల్లో మిర్చి పైరును బొబ్బర తెగులు ఆశించింది. మేడికొండూరు మండలం శిరిపురం, మేడికొండూరు గ్రామాల్లో ఈ తెగులు తీవ్రత అధికంగా ఉంది. మొక్కల ఆకులు ముడతలు పడడం, గిడసబారిపోవడం తదితర దశలను కొంతమంది రైతులు ప్రాథమిక స్థాయిలోనే గుర్తించారు. ఈ తెగులు పక్క మొక్కలకు కూడా వ్యాపిస్తుండడంతో అటువంటి మొక్కలను తొలగించడానికే మేడికొండూరు, సత్తెనపల్లి, ఫిరంగిపురం, ముప్పాళ్ల రైతులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇటువంటి మొక్కలను తొలగించి కొత్తవి నాటుతున్నారు. బొబ్బర తెలుగు నివారణకు సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖాధికారులు సూచిస్తున్నారు.