Mar 02,2021 22:05

సమావేశంలో మాట్లాడుతున్న మనోహర్‌

 కడపఅర్బన్‌ విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలని, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 5న నిర్వహించే బంద్‌ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ పిలుపు నిచ్చారు. మంగళవారం సిఐటియు కార్యాలయంలో సిఐటియు, ఎఐటియుసి, కార్మిక, ఉద్యోగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రయివేటీకరించడం ద్వారా వేలాది మంది ఉద్యోగ, ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు. ప్రయివేట్‌ వ్యక్తులకు ఉక్కు పరిశ్రమను కట్టబెట్టే చర్యలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలో పొందు పరచిన హామీ మేరకు జిల్లాలో సెయిల్‌ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బంద్‌కు ప్రజలను, ఉద్యోగులను, వ్యాపారులను సన్నద్ధం చేయాలని నాయకులకు పిలుపు నిచ్చారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ బంద్‌కు అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు. సంఘ సేవకులు సయ్యద్‌ సలావుద్దీన్‌ మాట్లాడుతూ బంద్‌కు ముందు రోజు వైవి స్ట్రీట్‌, బికెఎం స్ట్రీట్‌లో ప్రచారం చేసి బంద్‌కు సహకరించాలని వ్యాపార వర్గాలను కోరుతామన్నారు. రైతు, వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శులు దస్తగిరిరెడ్డి, అన్వేష్‌ మాట్లాడుతూ బంద్‌ విజయవంతానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసులురెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులు రాజేంద్ర ప్రసాద్‌, ఎం.ఆర్‌.నాయక్‌, మున్సిపల్‌ ఫెడరేషన్‌ జిల్లా, నగర ప్రధాన కార్యదర్శులు విజయభాస్కర్‌, కేశవ, నాయకులు రాజకుళ్ళాయమ్మ, కైపు రామాంజనేయులు, ఆర్‌.ఎన్‌.రాజా, ఎంఆర్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు దస్తగిరి పాల్గొన్నారు.
ఈ నెల 5న నిర్వహించే బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.ఆర్‌.నాయక్‌, సగిలి రాజేంద్ర ప్రసాద్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు దస్తగిరి పిలుపు నిచ్చారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా నాయకులు పవన్‌ కళ్యాణ్‌, సురేష్‌ పాల్గొన్నారు.
రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల జెఎసి గౌరవాధ్యక్షులు సయ్యద్‌ సలావుద్దీన్‌ పిలుపు నిచ్చారు. మంగళవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో జెఎసి బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసులురెడ్డి, మనోహర్‌, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, ఎంఆర్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు దస్తగిరి, నాయకులు కైపు రామాంజనేయులు, శివ, వినోద్‌, అన్వేష్‌, విజయ భాస్కర్‌, కేశవ, రాజకుళ్ళాయమ్మ పాల్గొన్నారు.