Oct 28,2021 19:12

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న బిసి కమిషన్‌ చైర్మన్‌ శంకరనారాయణ

ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో వెనుకబడిన తరగతుల జీవితాలను మెరుగుపరిచే దిశగా జిల్లా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర బిసి కమిషన్‌ చైర్మన్‌ అంబటి శంకరనారాయణ జిల్లా అధికారులను కోరారు. బిసిలకు అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుపై గురువారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా అధికారులతో రాష్ట్ర బిసి కమిషన్‌ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ బిసి యువతకు చెందాల్సిన ఉద్యోగాలు రిజర్వేషన్ల మేరకు వారికి దక్కేలా అధికారులు జాగ్రత్త వహించాలన్నారు. బిసిల పేరుతో నకిలీ ధ్రువపత్రాలు పొందేవారి పట్ల అప్రమత్తంగా వుండాలని, బిసిలకు చెందాల్సిన ప్రయోజనాలు ఇతరులకు వెళ్లకుండా చూడాలని సూచించారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం లేకుండా త్వరితగతిన మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. సభ్యులు పి.వెంకట సత్యదివాకర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బి.సి.ల అభ్యున్నతి కోసం విద్య, వైద్యం, సంక్షేమం బిసి ల్లో ఇప్పటికీ ఎంతోమంది నిరుపేద కూలీలుగా జీవనం సాగిస్తూ పేదరికంలో ఉన్నారని, ఈ జిల్లా పరిస్థితులను దృష్టిలో వుంచుకొని వారి సంక్షేమం, అభివృద్ధిపై మరింత కృషి చేయాలన్నారు. బిసి విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న వెంటనే కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరయ్యేలా చర్యలు చేపట్టాలని కమిషన్‌ సభ్యులు ఎం.కృష్ణప్ప సూచించారు. బిసిలు సివిల్స్‌, గ్రూప్‌-1 వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా వారికి శిక్షణ సదుపాయాలు కల్పించాలని కోరారు. మరో సభ్యులు అవ్వారు ముసలయ్య మాట్లాడుతూ వడ్డెర కులస్థులకు విశ్వబ్రాహ్మణ పేరుతో కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారని, వారికి వడ్డెర పేరుతోనే ఇవ్వాలని కోరుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్‌ సూర్యకుమారి మాట్లాడుతూ బి.సి.వర్గాల వారికి ఇంటిగ్రేటెడ్‌ కుల ధ్రువ పత్రాలు త్వరితగతిన మంజూరు చేసేందుకు డేటాబేస్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తప్పుడు సమాచారం ఇచ్చి కుల ధ్రువీకరణ పత్రాలు పొందే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఎస్‌పి ఎం.దీపిక, డిఆర్‌డిఎ పీడీ తమశాఖ దారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌లు డాక్టర్‌ జి.సి.కిషోర్‌ కుమార్‌, ఆర్‌.మహేష్‌ కుమార్‌, జె.వెంకటరావు, సబ్‌ కలెక్టర్‌ భావన, బిసి సంక్షేమాధికారి కీర్తి, బిసి కార్పొరేషన్‌ ఇడి పెంటోజీరావు తదితరులు పాల్గొన్నారు.