Jan 15,2022 07:36

ఎ.పి, తెలంగాణలకు బిజెపి కేంద్రం చేసింది లేకపోగా వివక్షకు గురి చేసిందనే అభిప్రాయం, అసంతృప్తి ప్రజలలో బలంగా వున్నాయి. కనుకనే ఇక్కడ పాలక పార్టీలు కూడా బిజెపి కి వ్యతిరేకంగా గట్టిగా పోరాడేట్టు చూడాలన్నది సిపిఎం నిశ్చితాభిప్రాయం. జాతీయ స్థాయిలో ఎప్పటికి ఏం జరుగుతుందనేది వేచి చూడవలసిన అంశం. ఎందుకంటే బిజెపికి వ్యతిరేక కూటమికి తానే నాయకురాలినన్నటు, కాంగ్రెస్‌ స్థానం తనదే అయినట్ట్టు పశ్చిమ బెంగాల్‌ తృణమూల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హడావుడి చేస్తున్నా ఆమె విశ్వసనీయతకు, విస్తరణకు పరిమితులున్నాయి. పంజాబ్‌, గోవాలలో ఆప్‌ కూడా అదే ధోరణిలో వుంది. ఫిబ్రవరి మార్చి ఎన్నికల ఫలితాల తర్వాత వీరిలో ఎవరి అంచనాలు, ఆశలు ఏమేరకు నిజమయ్యేది తేలిపోతుంది. దాంతోపాటే భవిష్యత్‌ పరిణామాల సంకేతాలూ వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో బిజెపిని ఎవరు ఏ మేరకు వ్యతిరేకించినా లౌకిక ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి మేలు కలుగుతుంది. అలాంటి అన్ని ప్రయత్నాలను బలపర్చడంతో పాటు ఆ పోరాటాన్ని మరింత బలోపేతం చేయడం కీలక కర్తవ్యమవుతుంది.

    సిపిఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఇటీవల హైదరాబాదులో ముగిశాయి. బిజెపిని ఓడించేందుకుగాను ఆయా రాష్ట్రాల రాజకీయ పొందికను బట్టి సరైన వ్యూహాన్ని నిర్ణయించుకోనున్నట్టు ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సమావేశాల అనంతరం చెప్పారు. చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు బలంగా వున్న నేపథ్యం గమనంలో వుంచుకొని అడుగులు వేస్తామన్నారు. ఈ సమావేశాలకు ముందు నుంచి షరా మామూలుగా కాంగ్రెస్‌తో పొత్తుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారా లేదా అని ఊహాగానాలు చేసిన మీడియా ఆయనను అదే విధమైన ప్రశ్నలు వేసింది. రాష్ట్రాలలో పరిస్థితి అన్నప్పుడు కాంగ్రెస్‌ ప్రధాన పాత్రలో వున్న చోట్ల లేదా తమిళనాడులో డిఎంకె కూటమిలో అది వున్నచోట తగు విధంగా చర్చించి నిర్ణయిస్తామని ఏచూరి స్పష్టం చేశారు. నిరంకుశ మతతత్వ విధానాలు, విశృంఖల కార్పొరేటీకరణ, ప్రజా వ్యతిరేక పోకడలు, రాష్ట్రాలపై దాడులకు ప్రతిరూపంగా మారిన బిజెపిని ఓడిస్తేనే దేశానికి రక్ష అని సిపిఎం భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. యు.పి లో సమాజ్‌వాది పార్టీ బిజెపి ని ఓడించే ప్రధాన శక్తిగా వుందని, దాన్ని తాము బలపర్చడం ఒకటైతే పొత్తులు, సర్దుబాట్లు ఏ మేరకు సాధ్యమో చూడాల్సి వుందని సిపిఎం నేత వివరించారు. రైతాంగ ఉద్యమానికి అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్‌లో ఇప్పటికే సిపిఐ, సిపిఎం చర్చలు జరిపాయని ఇతర పక్షాల విషయం పరిశీలిస్తామని తెలిపారు.
 

                                                సిపిఎం విధానం, బిజెపి దుష్ప్రచారం

ఏప్రిల్‌లో కేరళలో జరిగే సిపిఎం 23వ అఖిల భారత మహాసభలకు రాజకీయ ముసాయిదా విడుదల చేసినప్పుడు మరింత నిర్దిష్టంగా ఈ విషయం చర్చకు వస్తుంది. మహాసభ ఇచ్చే తుదిరూపం రానున్న మూడేళ్లకు మార్గదర్శకమవుతుందనేది తెలిసిందే. కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతున్నప్పుడే యు.పి, పంజాబ్‌లతో సహా అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో ఈ సమావేశం నిర్ణయాలు మరింత ప్రాధాన్యత పొందాయి. బిజెపిని ఓడించేందుకు తృతీయ కూటమి ఏర్పాటు మాట వచ్చినప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాతనే ఏ సంఘటనైనా సాధ్యమని ఏచూరి సోదాహరణంగా చెప్పారు. 1977లో జనతా పార్టీ కూడా ఎన్నికల తర్వాతనే ఏర్పడిందనీ, 1989, 1996, 1998, 2004 ఎన్నికల తర్వాతనే కూటముల నామకరణం రూపకల్పన జరిగాయని గుర్తు చేశారు. దీన్నిబట్టి సిపిఎం ప్రత్యామ్నాయం ఏర్పడుతుందనే విశ్వాసం కోల్పోయిందని బిజెపి నేతలు కొందరు వ్యాఖ్యలకు పాల్పడటం హాస్యాస్పదం. బిజెపిని నికరంగా ఖచ్చితంగా వ్యతిరేకించే సిపిఎం, వామపక్షాల విధానం తెలిసినా అదేదో కాంగ్రెస్‌ అనుకూలతగా చిత్రించే వారి ప్రచారాలకు అవకాశం లేకుండా పోయింది. దాంతో అసలు కమ్యూనిస్టులకు ఉనికి లేకుండా పోయిందని ఉక్రోషపూరితమైన వ్యాఖ్యలకు దిగారు. మొన్నటి రైతాంగ ఉద్యమంతో కేంద్రం మెడలు వంచడంలో ముందు నిలిచింది...రేపు ఫిబ్రవరిలో దేశ వ్యాపిత సమ్మెతో మరో సమరభేరి మోగించనున్నదీ కమ్యూనిస్టులనే వాస్తవం వారు దాచేస్తే దాగదు. నోరు తెరిస్తే కమ్యూనిస్టులు తమ సైద్ధాంతిక శత్రువులని ప్రకటించే బిజెపి సిపిఎం రాజకీయ విధానం సహించలేకపోవడంలోఆశ్చర్యం ఏమీలేదు.
 

                                                        కెసిఆర్‌తో భేటీ, చర్చలు

ఈ సమావేశం సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, సీతారాం ఏచూరి తదితరులు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి చర్చలు జరపడంపై బిజెపి మరిన్ని ప్రచారాలకు దిగుతున్నది. పినరయి గతం లోనూ కెసిఆర్‌ను కలుసుకున్న సందర్భాలున్నాయి. రాష్ట్రాల మధ్య సంబంధాలు, ఫెడరల్‌ వ్యవస్థపై బిజెపి దాడులను ఎదుర్కోవలసిన అవసరం రీత్యా ఇలాంటి పరస్పర భేటీలు చాలా అవసరం, ఉపయోగం కూడా. బిజెపి ముఖ్యమంత్రులు వరుసకట్టి దిగిపోయి కెసిఆర్‌ను అరెస్టు చేసి ఈడ్చుకుపోతామని నోరు పారేసుకుంటున్న సమయంలో పినరయి విజయన్‌-కెసిఆర్‌ భేటీ ప్రత్యేకత సంతరించుకుంది. వాస్తవానికి ఎపి ముఖ్యమంత్రి జగన్‌ కూడా తనపై వున్న సిబిఐ కేసుల కారణంగానే కేంద్రం ముందు మౌనంగా వుంటున్నారనే అభిప్రాయం బలంగా వుంది. బిజెపి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా వినియోగించడం అందరూ చూస్తున్నదే (కేరళ ప్రభుత్వం ఈ అంశంపై కోర్టులో సవాలు చేసింది కూడా). విజయన్‌ కేంద్ర కమిటీ సమావేశాలకు వస్తున్నారని తెలుసుకున్న కెసిఆర్‌ సిపిఎం జాతీయ నాయకత్వాన్ని కూడా ఆహ్వానించారు. దేశ రాజకీయ పరిస్థితులు బిజెపిని ఓడించవలసిన అవసరం వుందని ఉభయులూ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో హైదరాబాదు పర్యటనలో వున్న సిపిఐ కార్యదర్శి రాజా కూడా సిపిఐ తెలంగాణ నాయకులతో కెసిఆర్‌ను కలిశారు. సిపిఎంకు సంబంధించి తెలుగు రాష్ట్రాల నేతలు కలిసినవారిలో లేరు. తాము మౌలికంగా బిజెపిని ఓడించేందుకు కృషి జరగాలనే విషయం మాట్లాడామని, తెలంగాణలో నిర్దిష్టంగా ఏం చేయాలో రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకుంటుందని మీడియాకు జాతీయ నేతలు చెప్పారు. దేశంలోనైనా రాష్ట్రాలలోనైనా ఎన్నికలు వచ్చినపుడు పొత్తులు ఎత్తుగడలు నిర్ణయమవుతాయి తప్ప ముందస్తుగా వాటి గురించి నిర్ణయాలు వుండబోవని వివరించారు. ఏదో కెసిఆర్‌ దావత్‌ కోసమే కలిసినట్టు ఆరోపణలు చేసేవారికి ఈ సమాధానం రుచించకపోయినా చేయగలిగింది వుండదు.
 

                                                              కాంగ్రెస్‌ పరిస్థితి

పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వంటి వారు బిజెపి, టిఆర్‌ఎస్‌ ఒకటేనని తమను రాకుండా చేయడానికే ఈ వ్యతిరేక ప్రహసనం నడిపిస్తున్నారని చేసే ఆరోపణలు ఆ పార్టీ కోణాన్ని చెబుతాయి. కెసిఆర్‌ అంతకు ముందు తమిళనాడు వెళ్లి ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసి వచ్చారు. వామపక్ష నాయకులతో చర్చల తర్వాత రెండు రోజులకు బీహార్‌ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ వచ్చారు. దీని తుది రూపం తెలియకపోయినా గతంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ అన్నప్పటికి భిన్నంగా ఈసారి కెసిఆర్‌ వ్యవరిస్తున్నారనేది పరిశీలకుల భావన. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ బలహీనంగా వుందనేది ఆ నాయకులు జీర్ణించుకోవాలి. బిజెపిని నిలవరించగల శక్తులుగా పలు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు వున్నాయన్నది కూడా వాస్తవం. ఆ పార్టీలతో కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్న తీరు కూడా ఒకే మాదిరిగా లేదు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్‌ ప్రత్యర్థిగా వుంటుంది. కేరళ లోనే సిపిఎంకు కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుడిఎఫ్‌ ప్రధాన ప్రత్యర్థిగా వుంటున్నది. దాని అంతర్గత పరిస్థితి ఇప్పటికీ అస్తవ్యస్తంగా అయోమయంగానే వున్నది. బిజెపిని వ్యతిరేకించడం కంటే స్థానికంగా తన ప్రయోజనాలే ప్రధానంగా చూసుకుంటూ అంతర్గత వివాదాల్లో మునిగి తేలుతున్నది. బిజెపి ని దేశవ్యాప్తంగా ఓడించాల్సిన కర్తవ్యం ముందుకొచ్చిన నేపథ్యంలో ఆ రాష్ట్రాల లోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌తో కలిసి వ్యవహరించాల్సిందేనన్న వాదన చెల్లదు. అదే సమయంలో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రధాన శక్తిగా వుందన్నది వాస్తవం. ఇప్పుడు ఎన్నికలు జరిగే అయిదు రాష్ట్రాల లోనూ పంజాబ్‌ సహా మూడు నాలుగు చోట్ల కాంగ్రెస్‌ బిజెపిని వ్యతిరేకించే ఒక శక్తిగా వుంది. కనుకనే రాష్ట్రాలలో పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని సిపిఎం చెబుతున్నది. ఈ క్రమంలో జాతీయ స్థాయిలోనూ రాష్ట్రాలలోనూ కూడా ముఖ్యమంత్రులను కీలక నేతలను కలుసుకోవడంలో వింతేమీ లేకపోగా రాజకీయ చొరవలో భాగంగా చూడవలసి వుంటుంది.
 

                                                     తెలుగు రాష్ట్రాలపై కేంద్రం వివక్ష

ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో బిజెపి పరిస్థితి ఎంత దారుణంగా వుందో ముగ్గురు మంత్రులు, పదిహేను మంది ఎంఎల్‌ఎల నిష్క్రమణతోనే తెలుస్తుంది. వారు చాలా వరకూ సమాజ్‌వాది పార్టీతో చేరుతున్నారు. యు.పి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విజయంపైనే ప్రధాని మోడీ పునరాగమనం ఆధారపడి వుందని హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యను గుర్తు చేసుకుంటే దీని ప్రభావం అర్థమవుతుంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌, ఆప్‌ల అవకాశాల గురించి తప్ప బిజెపి చర్చలో లేదు. కాంగ్రెస్‌ నుంచి రాజీనామా చేసిన తాజా మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌తో పొత్తు పైనే అది దింపుడు కల్లం ఆశలు పెట్టుకుంది. మిగిలిన మూడు రాష్ట్రాలలో కూడా పోటీ గట్టిగానే వుంటుంది. ఈ పూర్వ రంగంలో ఉత్తరాదిన తగిలే దెబ్బను కాస్తయినా భర్తీ చేసుకోవడానికి దక్షిణాదిన హడావుడి పెంచుతున్నట్టు అర్థమవుతుంది. అయితే దక్షిణ భారతంలో కేరళ, తమిళనాడు, ఎ.పి, తెలంగాణలలో ఎక్కడా బిజెపికి బలం లేదు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్‌, జెడిఎస్‌ల నుంచి పోటీ వుంటుంది. ఎ.పి, తెలంగాణల లోని వైసీపీ, టిఆర్‌ఎస్‌ పార్టీలు పార్లమెంటులో చాలాసార్లు మోడీ విధానాలకు మద్దతునిచ్చినా ఇటీవల కెసిఆర్‌ కొంత విమర్శ పెంచారు. ఎ.పి సి.ఎం జగన్‌ వైపున అలాంటి సూచనలేమీ లేవు. ఇటీవలే ముగిసిన సిపిఎం ఏ.పి మహాసభలు రాష్ట్రం పట్ల మోడీ ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం పోరాడవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాయి. ఆ తర్వాత కాలంలో బిజెపి నేతలు మత తత్వ రాజకీయాలు మరింత పెంచారు. నూతన కార్యదర్శి వి. శ్రీనివాసరావు అనంతపురంలో దీనిపై కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా. గుంటూరులో జిన్నా టవర్‌ వివాదం, తెలంగాణలో హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా మార్చాలనే పిలుపు ఇందులో భాగాలే. ఎ.పి క్రైస్తవ రాష్ట్రంగా తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా మారిపోయాయని ఆ పార్టీ నేతలు అంటుంటారు. అయినా జనసేన వారితో పొత్తు కట్టగా టిడిపి కూడా అందుకు పాకులాడుతున్నట్టు వ్యవహరిస్తున్నది. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని, బిజెపి విషయంలో కెసిఆర్‌ మరింత దృఢంగా పోరాడాలని తాము భావిస్తున్నామని రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు.
     ఎ.పి, తెలంగాణ లకు బిజెపి కేంద్రం చేసింది లేకపోగా వివక్షకు గురి చేసిందనే అభిప్రాయం, అసంతృప్తి ప్రజలలో బలంగా వున్నాయి. కనుకనే ఇక్కడ పాలక పార్టీలు కూడా బిజెపి కి వ్యతిరేకంగా గట్టిగా పోరాడేట్టు చూడాలన్నది సిపిఎం నిశ్చితాభిప్రాయం. జాతీయ స్థాయిలో ఎప్పటికి ఏం జరుగుతుందనేది వేచి చూడవలసిన అంశం. ఎందుకంటే బిజెపికి వ్యతిరేక కూటమికి తానే నాయకురాలినన్నటు, కాంగ్రెస్‌ స్థానం తనదే అయినట్ట్టు పశ్చిమ బెంగాల్‌ తృణమూల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హడావుడి చేస్తున్నా ఆమె విశ్వసనీయతకు, విస్తరణకు పరిమితులున్నాయి. పంజాబ్‌, గోవాలలో ఆప్‌ కూడా అదే ధోరణిలో వుంది. ఫిబ్రవరి మార్చి ఎన్నికల ఫలితాల తర్వాత వీరిలో ఎవరి అంచనాలు, ఆశలు ఏమేరకు నిజమయ్యేది తేలిపోతుంది. దాంతోపాటే భవిష్యత్‌ పరిణామాల సంకేతాలూ వస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో బిజెపిని ఎవరు ఏ మేరకు వ్యతిరేకించినా లౌకిక ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి మేలు కలుగుతుంది. అలాంటి అన్ని ప్రయత్నాలను బలపర్చడంతో పాటు ఆ పోరాటాన్ని మరింత బలోపేతం చేయడం కీలక కర్తవ్యమవుతుంది. యావత్తు దేశం ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని సిపిఎం తగిన ఎత్తుగడలతో బిజెపి పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత చెదిరిపోకుండా వుండే విధంగా వ్యవహరిస్తున్నది. దీనిపై ఎలాంటి కుటిల వ్యాఖ్యానాలకూ కృత్రిమ నిర్ధారణలకు చోటుండదు.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి