Mar 02,2021 20:36

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అసోం, పశ్చిమ బెంగాల్‌, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలకు రైతు బృందాలను పంపనున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కెఎం) ప్రకటించింది. తాము ఏ పార్టీకి మద్దతుగా వెళ్లడం లేదని.. రైతులు, కార్మికుల పట్ల అహంకార వైఖరిని అవలంభిస్తున్న బిజెపిని దాని మిత్రపక్షాలను చిత్తుగా ఓడించాలని ఆయా ప్రాంతాల్లో ప్రజలను కోరుతామని ఎస్‌కెఎం సమన్వయ కర్త దర్శన్‌ పాల్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలపై ఎస్‌కెఎం ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. మార్చి 6 నాటికి రైతాంగ పోరాటం 100 రోజులకి చేరుకుంటున్న నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లోని కుండ్లి-మనేసర్‌-పల్వాల్‌(కెఎంసి) ఎక్స్‌ప్రెస్‌ వేను పూర్తిగా దిగ్భంధనం చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా రైతులంతా తమ ప్రజలు ఇంటివద్ద నల్ల జెండాలు ఎగురవేయాలని సూచించారు. 5న కర్ణాటకలో ఎంఎస్‌పి దిలావ్‌ పేరుతో ఉద్యమం, 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీక్షాస్థలాల్లో మహిళలు ఉద్యమం చేస్తారన్నారు. 10 నుంచి 15 వరకు కార్మికులు, ఉద్యోగులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామన్నారు.