
చంఢీఘర్ : వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించడం.. బిజెపికి నైతిక ఓటమని అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్సింగ్ బాదల్ ట్వీట్ చేశారు. అయితే ఈ చట్టాలపై కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. రైతుల ఆందోళనను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని, ఆందోళనలు ఇంకా కొనసాగడం కచ్చితంగా కేంద్రం అసమర్థత ఫలితమేనని మండిపడ్డారు. రైతు చట్టాల మద్దతుదారులతో కమిటీని ఏర్పాటు చేయడం హాస్యాస్పదమని, ఇది ఆమోద యోగ్యంకాదని ధ్వజమెత్తారు. హింసను ప్రేరేపించడానికి, శాంతి యుతంగా, గౌరవ ప్రదమైన రైతుల పోరాటాన్ని కించపరిచేలా ఖలిస్తానీలు నిరసనలో చొరబడ్డారని, నిషేధించబడిన సంస్థలు నిరసనల్లోకి ప్రవేశించాయన్న ప్రభుత్వం ఆరోపిస్తోందని సుఖ్బీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. అకాలీదళ్ ఓటు వేయడంతో పాటు ఎన్డిఎతో పొత్తును కూడా విరమించుకుందని అన్నారు. కేంద్ర కేబినెట్ కు హరిసిమ్రత్ బాదల్ కౌర్ రాజీనామా చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమ పార్టీ వైఖరిని సుప్రీంకోర్టు సమర్థించిందని అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు సంస్థలు పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలలో తమ పార్టీ కూడా పాల్గొంటుందని బాదల్ ప్రకటించారు.