Feb 28,2021 07:16

గువాహటి : అసోంలో బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ (బిపిఎఫ్‌) బిజెపికి గుడ్‌బై చెప్పింది. ఇకపై రాష్ట్రంలో బిజెపితో కలిసి నడవలేమని, కాంగ్రెస్‌ కూటమిలో భాగస్వామ్యమవుతామని బిపిఎఫ్‌ నేత హగ్రామా మొహిలరీ ప్రకటించారు. ఈ నిర్ణయం కాంగ్రెస్‌ నేతృత్వంలోని అసోంలో ఏర్పాటైన కూటమి బలోపేతానికి ఉపకరించనుంది. రాష్ట్రంలో శాంతి, ఐక్యత, అభివృద్ధి, సుస్థిర ప్రభుత్వం, అవినీతి రహిత అసోం కోసం కాంగ్రెస్‌ కూటమితో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు హగ్రామా ప్రకటించారు. బిజెపితో స్నేహం కొనసాగించలేమని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమితోనే కలిసి ముందుకెళ్తామని ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. కాగా,2016లో జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 126 స్థానాలకు గాను బిపిఎఫ్‌ 12 స్థానాలు గెలుచుకుంది. అనంతరం బిజెపి కూటమిలో చేరింది. సర్బానంద సోనోవాల్‌ మంత్రిమండలిలోకి బిపిఎఫ్‌ నుండి ముగ్గురిని మంత్రులుగా తీసుకున్నారు. అయితే, ఇటీవల అసోం ఆర్థికమంత్రి హిమంత బిశ్వశర్మ కూడా బిపిఎఫ్‌తో పొత్తు ఉండబోదని ప్రకటించడం గమనార్హం. గతేడాది డిసెంబర్‌లోనే అసోంలో స్వయం పాలిత బోడోలాండ్‌ ప్రాదేశిక మండలి (బిటిసి)లో బిజెపి బిపిఎఫ్‌ను కాదని యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌ (యుపిపిఎల్‌)తో చేతులు కలిపింది. దీంతో బిటిసి నూతన ప్రధాన కార్యనిర్వాహక సభ్యునిగా యుపిపిఎల్‌ అధినేత ప్రమోద్‌ బోరో బాధ్యతలు చేపట్టారు. మొత్తం 40 స్థానాలు ఉన్న బిటిసికి జరిగిన ఎన్నికల్లో బిపిఎఫ్‌ 17 సీట్లను సాధించగా.. యుపిపిఎల్‌కు 12 స్థానాలు, బిజెపికి తొమ్మిది స్థానాలు లభించాయి. బిజెపి, బిపిఎఫ్‌లు కలిసి బిటిసి పరిపాలనా బాధ్యతలు చేపడతాయని పలువురు భావించారు. సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ తమకు మద్దతివ్వాలని బిపిఎఫ్‌ అధ్యక్షుడు హగ్రామా మొహిలరీ బిజెపిని కోరారు. అయితే యుపిపిఎల్‌ను తమ మిత్రపక్షంగా పేర్కొంటూ.. అమిత్‌ షా, ప్రధాని మోడీలు ట్వీట్‌ చేయడంతో బిపిఎఫ్‌ అసంతృప్తికి  గురైనట్లు పలువురు పేర్కొంటున్నారు.