Apr 14,2021 21:29

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇటీవల కేంద్రం కొత్తగా నియమించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) బోర్డులో నాన్‌-అఫీషియల్‌ సభ్యుల్లో అత్యధికులు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ వారే. 46 మంది సభ్యుల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) బోర్డులో 26 మంది అధికారిక సభ్యులు, 20 మంది నాన్‌-అఫీషియల్‌ సభ్యులు ఉన్నారు. వైస్‌ చైర్మన్‌గా ఎంఎస్‌ఎంఇ సహాయ మంత్రి ప్రతాప్‌ చంద్ర సారంగి, బోర్డు సభ్యులుగా ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం రాష్ట్రాల మంత్రులు ఉన్నారు. ముగ్గురు ఎంపిలు శంకర్‌ లాల్వాని (బిజెపి), భీశెట్టి వెంకట సత్యవతి (వైసిపి), బండా ప్రకాష్‌ (టిఆర్‌ఎస్‌) సభ్యులుగా ఉన్నారు. ప్రముఖ వ్యక్తుల విభాగంలో సిలిగురి బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌ కుమార్‌ అగర్వాల్‌ (పారిశ్రామిక వేత్త), లఘు ఉద్యోగ్‌ భారతి ఉపాధ్యక్షుడు స్మిత యశ్వంత్‌ ఘైసాస్‌ (ఆర్థికవేత్త), ఆయురాన్‌ ఇంప్లాంట్స్‌ ఎమ్‌డి, దివంగత బిజెపి నేత మనోహర్‌ పారికర్‌ కుమారుడు ఉత్పాల్‌ పారికర్‌లను నియమించారు. ఈ బోర్డులో బీహార్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే కుందన్‌ కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే పి.విష్ణు కుమార్‌ రాజు, 2014లో హర్యానా ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి యశ్వీర్‌ డాగర్‌, 2009లో ఒరిస్సాలోని కటక్‌ బిజెపి అభ్యర్థి, రెండు కంపెనీల్లో డైరెక్టర్‌ ప్రదీత్‌ కేషరి మిశ్రా, ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి టీనా శర్మ, బిజెపి పూర్వాంచల్‌ మోర్చా నేత రష్మి మిశ్రా, బిజెపి మణిపూర్‌ ప్రదేశ్‌ కోశాధికారి రాబిన్‌ బ్లాకీ, బిజెపి పంజాబ్‌ స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ రాకేశ్‌ గుప్తా, బిజెపి ఉద్యోగ్‌ అగాడి మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్‌ పేష్కర్‌, బిజెపి యువ మోర్చా ఉపాధ్యక్షుడు, వడోదరకు చెందిన పి-మెట్‌ హైటెక్‌ డైరెక్టర్‌ హేమల్‌బెన్‌ మెహతా, బిజెపి గుజరాత్‌ రాష్ట్ర కార్యదర్శి అమిత్‌ థాకర్‌ భార్య, లఘు ఉద్యోగ్‌ భారతి (ఎల్‌యుబి) అధ్యక్షుడు బల్దేవ్‌భారు గోవింద్‌భారు ప్రజాపతి, ఎల్‌యుబి జాతీయ సమన్వయ కర్త నరేష్‌ చంద్‌ పరీక్‌, కార్యదర్శి సంపత్‌ తోష్నివాల్‌ తదితరులున్నారు.