
పాట్నా: బీహార్ అసెంబ్లీలో శుక్రవారం గందరగోళ వాతావరణం నెలకొంది. మహాగట్బంధన్ నేత, ప్రతిపక్ష నాయకుడు తేజశ్వీ యాదవ్ సంధించిన ఆరోపణలకు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సూటీగా సమాధానం చెప్పలేక అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగినా ఇంతలా ఆగ్రహావేశాన్ని సభలో ప్రదర్శించడం ఇదే తొలిసారి. 'అతను (తేజస్వియాద్) చెబుతున్నది అబద్ధం' అని గట్టిగా అరుస్తూ నితీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్‌కుమార్ నిందితుడిగా పేర్కొన్న ఒక హత్య కేసుకు సంబంధించి తేజస్వీ మాట్లాడుతూ 'నేను వాస్తవాల ఆధారంగా మాట్లాడుతున్నా. ఇదే హత్య కేసులో ముఖ్యమంత్రి జరిమానా కట్టలేదా?' అని ప్రశ్నించారు. దీనికి తీవ్రంగా స్పందించిన నితీష్ 'అతను (తేజస్వీ) చెబుతున్నది అబద్ధం' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నేను సోదరుడిగా భావించే నా మిత్రుడు లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు అయినందునే ఓపికతో అతని (తేజస్వీ) ప్రసంగం విన్నాను. ఆయనను ఉపముఖ్యమంత్రి చేసిందెవరో తెలియదా? ఛైర్‌కు సవాలు విసురుతున్నా అతను ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారో నిరూపించమనండి. లేదా తగిన చర్యలు తీసుకోండి' అని స్పీకర్‌ను కోరారు.