Jan 14,2021 12:41

పాట్నా : బీహార్‌లోని కల్తీ ప్రభుత్వంలో ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌జెడి ఎమ్మెల్యే బంధువుపై దాడి జరిగినట్లు మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో తేజస్వి గురువారం ట్విటర్‌ వేదికగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి, ఆయన డిప్యూటీలకు బిహార్‌లో రోజుకు 100 నుంచి 150 వరకు శవాలను లెక్క పెట్టకుండా నిద్రపోరని ఆరోపించారు. ఆటవిక పాలన మహారాజు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తూ.. 'ఆర్‌జెడి ఎమ్మెల్యే అల్లుడిపై కాల్పులు' అనే శీర్షికతో కూడిన వార్తా కథనాన్ని తేజస్వి యాదవ్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు.