
బ్రిస్బేన్ : టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ నిర్లక్ష్యపు షాట్ ఆడి ఔటయ్యాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తనపై వస్తున్న విమర్శలను రోహిత్ అంతే ధీటుగా తిప్పికొట్టాడు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లైయన్ బౌలింగ్‌లో ఏరియల్ షాట్ ఆడి ఔటైనందుకు పశ్చాత్తాపం అస్సలు లేదని రోహిత్ చెప్పాడు. గతంలో అదే టెక్నిక్‌తో బౌండరీలు సాధించిన సందర్భాలను గుర్తుచేశాడు. బౌలర్లపై ఒత్తిడి తెచ్చేందుకు అలాంటి షాట్లు ఆడతానని తెలిపాడు. కాగా రోహిత్ శర్మ అనవసర షాట్‌కు ప్రయత్నించి ఔటవ్వడం విస్మయానికి గురిచేసిందని మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సంజరు మంజ్రేకర్, ఆకాశ్ చోప్రా విమర్శించిన విషయం తెలిసిందే. అది బాధ్యతారాహిత్యమైన షాట్ అని, ఎందుకింత నిర్లక్ష్యం.. అప్పనంగా వికెట్ సమర్పించుకున్నావ్ అని గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సామాజిక మాధ్యమాల్లోనూ రోహిత్‌ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. 'ఆ షాట్ ఆడినందుకు పశ్చాత్తాపం లేదు. బౌలర్లపై ఒత్తిడి పెంచడానికి అలాంటి షాట్లు ఆడతాను. నాథన్ లైయన్ తెలివైన బౌలర్. కష్టతరమైన బంతుల్ని విసురుతున్నాడు. అదే టెక్నిక్‌తో గతంలో ఎన్నోసార్లు విజయవంతంగా బౌండరీలు బాదా. కొన్నిసార్లు బంతి బౌండరీ అవతల పడవచ్చు. మరికొన్ని సార్లు ఔట్ అవ్వొచ్చు. దురదృష్టవశాత్తు ఈసారి ఔటయ్యా. ఏదేమైనా అలాంటి షాట్లు కొనసాగిస్తాను. అయితే నాపై జట్టు ఎంతో నమ్మకం ఉంచింది. దానికి తగ్గట్లుగా ఆడటం నా బాధ్యత. విమర్శల గురించి ఆలోచించను. నా దృష్టంతా ఆటపైనే ఉంటుంది' అని రోహిత్ తెలిపాడు.