Jan 18,2021 18:59

కర్నాటక సాంప్రదాయ నాటకరూపం యక్షగానం ఎంతో ప్రాచుర్యం పొందింది. భారీ శిరస్త్రాణాలు, మేకప్‌, బరువైన దుస్తులు, ఆభరణాలు యక్షగానం చేసే వారి ప్రత్యేక అలంకరణలు. సావిత్రిరావుకు చిన్నప్పటి నుంచీ యక్షగానం మీద ఆసక్తి ఉండేది. కర్రలను పట్టుకుని యుద్ధం చేస్తున్నట్లుగా ఒక మూల నుంచి మరో మూలకు ఎగురుతూ, దుముకుతూ నటించేదాన్నని చెబుతారామె. యుక్తవయసు వచ్చేసరికి ఎలాగైనా ఆ కళలో ప్రవేశించాలనుకుంది. అయితే అప్పుడు ఆడపిల్లలకు ఆ కళలో ప్రవేశం ఉండేది కాదు. దీంతో ఆమె కల కలగానే మిగిలిపోయింది.
పెరిగి పెద్దదైన సావిత్రిరావు ఉపాధ్యాయ వృత్తి చేపట్టింది. ఏ విద్యలోనైనా ప్రతిభ కనబర్చడం ఆమె నైజం. అలా 1987లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ తరపున 'ఉత్తమ ఉపాధ్యాయ' అవార్డును అందుకున్నారు. 1990లో రిటైరైన సావిత్రి తన భర్త నిర్వహిస్తున్న 'మక్కల సాహిత్య సంగమ్‌' సంస్థ కార్యకలాపాలు చూసుకుంటుండేవారు. ఆ సంస్థ కన్నడ సాహిత్యప్రతిభ గల పిల్లలను ప్రోత్సహించేది. అప్పుడే ఆమెలో మొలకెత్తిన చిరకాల స్వప్నం మళ్లీ మొగ్గలు తొడిగింది. యక్షగాన శిక్షణ తీసుకోవాలన్న ఆమె చిరకాల కోరికను భర్త శ్రీనివాసరావు కూడా ఎంతగానో ప్రోత్సహించారు. 'ఆ కళ అంటే ఆయనకు కూడా ఎంతో మక్కువ' అంటారు సావిత్రి. తరచూ వాళ్లిద్దరూ యక్షగాన ప్రదర్శనలు చూసేవారమని ఆనాటి సంగతులు గుర్తుచేసుకుంటుంటారు.
                                                       యక్షగాన ప్రయాణం సాగిందిలా...
2009లో యక్షగాన కళాకేంద్ర నిర్వాహకులను కలిశారు సావిత్రి. 'అప్పుడు నేను ఎంతో సిగ్గుపడ్డాను. ఈ వయసులో నేర్చుకోవడమేంటని ఎవరైనా నవ్వుతారని అనుకున్నాను. అయితే ఆ భయం పోగొట్టి, నన్ను ఎంతో ప్రోత్సహించారు నా భర్త. అప్పుడు నేను తీసుకున్న ఆ నిర్ణయం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. సంతృప్తికర జీవితాన్ని అనుభవించానన్న తృప్తి మిగిల్చింది' అంటారు సావిత్రి. ఈ కళలో పురుషులే ఎక్కువగా పాల్గొనేవారు. స్త్రీల సంఖ్య చాలా తక్కువ. కొంత కాలం క్రితం వరకు వారికి ప్రవేశమే ఉండేది కాదు. ఇప్పుడు 60 మంది స్త్రీలు ఉన్నారు. వారిలో ఎక్కువ వయసు ఉన్న మహిళ సావిత్రిరావు.
2009లో మొదలైన ఆమె ప్రయాణం 2018 నాటికి వందో ప్రదర్శన ఇచ్చే స్థాయికి ఎదిగింది. వాల్మికీ, దుర్యోధన, సుగ్రీవ, భీష్మ, ధర్మరాజు వంటి అనేక పాత్రలు సావిత్రి పోషించారు. 'నాటకరూపం వేసేటప్పుడు నేను ప్రత్యక్షంగా యుద్ధ విన్యాసంలో పాల్గొంటున్న అనుభూతిని పొందుతాను. అంతలా ఆ పాత్రలో లీనమవుతాను. ప్రదర్శన ఇచ్చేటప్పుడు ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తేనే, ఆ భావాన్ని సునాయసంగా ప్రదర్శించగల మ'ంటారు ఈ కళాభిమాని.
                                                           రెండింతల బరువుతో..
ఉదయం 6 గంటలకు మొదలయ్యే ప్రదర్శనకుగాను, అంతకు మునుపే మూడునాలుగ్గంటల ముందుగానే మేకప్‌ వేయడం ప్రారంభమవుతుంది. దుస్తులు, ఆభరణాలు వేసుకోవడానికే అరగంట పైగా పడుతుంది. 'కాస్ట్యూమ్‌ చాలా బరువుగా ఉన్నా వాటిలో నన్ను చూసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది అంటారు సావిత్రి. బక్కపల్చగా ఉండే ఆమె రెండింతల బరువు కాస్ట్యూమ్‌ను ధరిస్తుంది. అంత బరువు మోస్తూ ప్రదర్శన ఇవ్వడం ఏమంత సులభం కాదు. అందుకే 'నాటకరూపం బాగా రావాలంటే శారీరక బలం ఒక్కటే సరిపోదు. మానసికధైర్యం కూడా కావాల'ంటారామె. 'యక్షగానమే నాకు ఆ శక్తినిచ్చింది. ఈ వయసులో ఇది చాలా కష్టం కదా? అని ఎంతోమంది నన్ను అడుగుతుంటారు. వయసు ఒక సంఖ్య మాత్రమే. నేనేమీ చేయగలనో.. ఏమి చేయలేనో.. అది ఎలా నిర్ణయిస్తుంది? జీవితంలో ఎప్పుడూ మీ కలలను వదలకండి. ఎప్పుడో ఒకప్పుడు అది నెరవేరే సమయం వస్తుంది. అప్పుడు దాన్ని విడవకండి. మీ కలలను సాకారం చేసుకోవడానికి వయసు, లింగవివక్ష ఎప్పటికీ కారణం కాకూడదని బలంగా నమ్ముతాను' అంటూ బాలికలకు, మహిళలకు సందేశమిస్తున్నారు సావిత్రి రావు.

bamma3

 

bamma 4