Jun 11,2021 16:00

హైదరాబాద్‌ : నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. ఈ సినిమా టీజర్‌ని చూస్తే.. వీరి కాంబినేషన్‌ మళ్లీ హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకోనుందని తెలిసిపోతుంది. కాగా, బాలకృష్ణ తదుపరి చిత్రం ఆయన గురువారం (మే 10) పుట్టినరోజు సందర్భంగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటించనున్నారని చిత్రయూనిట్‌ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో క్రాక్‌ సినిమాలో జయమ్మగా నటించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌.. నటించనున్నారని చిత్రయూనిట్‌ స్పష్టం చేసింది. ఈ విషయంపై నటి వరలక్ష్మీ స్పందిస్తూ.. 'నేను క్రాక్‌ సినిమాలో జయమ్మగా నటించాను. ఈ పాత్ర నాకెంతో సంతోషాన్నిచ్చింది. మరలా క్రాక్‌ తర్వాత.. నాకెంతో ఇష్టమైన డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో మరోసారి పనిచేయడం ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొటానా అని ఆశగా ఎదురుచూస్తున్నాను' అని ఆమె అన్నారు.
ఈ సినిమాను గోపీచంద్‌ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. గోపిచంద్‌ మలినేని క్రాక్‌ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు బాలకృష్ణతో చేయబోయే సినిమాతో మరో హిట్‌ కొడతారో లేదో చూడాలి మరి.