
భోపాల్ : బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో సహా పలువురు నటీమణులకు ఫోటోలతో కూడిన 11 మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎ) జాబ్ కార్డులు మధ్యప్రదేశ్లో వెలుగుచూశాయి. దీంతో ఖర్గోన్ జిల్లాలోని పీపర్ ఖస్త్రడ నాకా గ్రామ పంచాయతీ కార్యదర్శి మొజిలాల్ సేనానిని సస్పెండ్ చేశారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత...పంచాయతీ కార్యదర్శిని విధుల నుండి తొలగించామని, గ్రామ రోజ్గర్ సహాయక్ రమ్ సింగ్ సేవలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిలిపివేశామని జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) గౌరవ్ బెనాల్ తెలిపారు.
వెబ్ పోర్టల్ నుండి బాలీవుడ్ నటీమణుల చిత్రాలతో కూడిన కార్డులను తొలగిస్తున్నామని, ఈ అవకతవకలు ఎలా జరిగాయో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోందని, అవసరమైతే, వివరణాత్మక దర్యాప్తు కోసం సాంకేతిక నిపుణులను నియమిస్తామని అన్నారు. దర్యాప్తులో వారిద్దరూ ఏదైనా నేరపూరిత ఉద్దేశాలకు పాల్పడినట్లు తెలిస్తే..క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు.