Nov 29,2020 23:46

దుగ్గిరాల మండలంలో పైరును పరిశీలిస్తున్న రైతు, కౌలురైతు సంఘాల నాయకులు

ప్రజాశక్తి - పెదనందిపాడు: దెబ్బతిన్న మిర్చి పొలాలను రైతు, కౌలురైతు సంఘం నాయకులు పరిశీలించారు. రైతు సంఘం తూర్పు గుంటూరు జిల్లా అధ్యక్షులు కె.అజరుకుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో సుమారు లక్ష ఎకరాలకు పైగా వాణిజ్య, ఉద్యాన పంటలు, 4 లక్షల ఎకరాల వరి దెబ్బతిందని, చేతికంది వచ్చిన వరి నీటి పాలైందని చెప్పారు. రైతులకు న్యాయం చేయాలని కోరారు.
దుగ్గిరాల : దెబ్బతిన్న పొలాలను రైతు, కౌలురైతు సంఘం నాయకులు పరిశీలించారు. రైతు సంఘం తూర్పు గుంటూరు జిల్లా అధ్యక్షులు కె.అజరుకుమార్‌, కౌలురైతు సంఘం తూర్పు గుంటూరు జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ-క్రాప్‌ బుకింగ్‌తో సంబంధం లేకుండా పంటనంతా కొనుగోలు చేయాలని కోరారు. 3వ తేదీన విజయవాడలో నిర్వహించే కౌలురైతు ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రైతుల్ని నష్టపరిచే, వ్యవసాయాన్ని నాశనం చేసే చట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతుల దీక్షలను భగం చేయాలనే కేంద్రం ప్రభుత్వ తీరుకు నిరసనగా దుగ్గిరాల, మంచికలపూడి గ్రామాల్లో నిరసన సభలు నిర్వహించారు. వి.సాంబశివరావు, ఎన్‌.యోగేశ్వర రావు, ఎం.నాగమల్లేశ్వరరావు, టి.పరసురా మారావు, నరసింహం, అమ్మిరెడ్డి పాల్గొన్నారు.
మంగళగిరి రూరల్‌ : మండలంలో దెబ్బతిన్న పొలాలను సిపిఎం నాయకులు పరిశీలించారు. వీరిలో ఎ.ప్రకాష్‌రావు, సాంబశివరావు, రఘు, నాగేశ్వరరావు, సత్యమారెడ్డి, రామారావు ఉన్నారు.
పెదవడ్లపూడిలో పొలాలు, అరటి తోటలను టిడిని రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి, మండల, గ్రామ అధ్యక్షులు చావలి ఉల్లయ్య, యాళ్ల శివరామయ్య పరిశీలించారు.
కొల్లిపర, తెనాలి: నష్టపోయిన దేవాలయ భూముల కౌల్దార్లకు కౌలు మాఫీతోపాటు ఎకరాకు రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని రైతు సంఘం తూర్పు గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెనాలి, కొల్లూరు మండలంలోని చివలూరు, సిరిపురం గ్రామాల్లో నాయకులు పరిశీలించారు.
పిడుగురాళ్ల: నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం పశ్చిమ గుంటూరు జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే పంట మొత్తం నీటి పాలైందని, ఈ నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని నిబంధనలేమీ లేకుండా కొనాలని కోరారు.
కర్లపాలెం: మండలంలోని చింతాయపాలెం, గణపవరం, పులుగువారిపాలెం, కట్టావాద, నర్రావారిపాలెం, తుమ్మలపల్లి, పెదగొల్లపాలెం, పేరలి, సమ్మెటవారిపాలెంలో దెబ్బతిన్న పొలాలను టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్రవర్మ పరిశీలించి రైతులతో మాట్లాడారు. డ్రెయినేజీ వ్యవస్థ రెండేళ్లుగా సరిగా లేకపోవడం వల్లే నిరు ఎక్కడికక్కడ పొలాల్లో నిలిచి రైతులను నష్టపరిచిందని చెప్పారు. పరిశీలనలో నాయకులు ఎరక్సన్‌బాబు, సరోజినీ, భూపతిరావు, వెంకట స్వామి, కన్నయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈపూరు: బాధిత రైతులకు ప్రభుత్వం న్యాయం చేసే వరకూ టిడిపి పోరాడుతుందని ఆ పార్టీ నరసరావుపేట పార్లమెంట్‌ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. కూచినపల్లిలో నేల వాలిన వరి పైర్లను ఆయన పార్లమెంట్‌ కమిటీ పరిశీలకులు ఫిరోజ్‌ ఖాన్‌తో కలిసి పరిశీలించారు. వరికి ఎకరాకు రూ.25 వేలు, మొక్కజొన్నకు రూ.25 వేలు, మిర్చికి రూ.50 వేలు ప్రభుత్వం చెల్లించాలన్నారు. పొలాలను సిఎం క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్న ఆయన తక్షణ సాయం ప్రకటన కంటితుడుపేనని విమర్శించారు.
తాడేపల్లి :పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు దానబోయిన సుందరరావు యాదవ్‌ కోరారు. ఈ మేరకు స్థానిక టిడిపి కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. ఢిల్లీలో రైతులపై దాడులను ఖండించారు. సమావేశంలో ఎస్‌.కిరణ్‌, ఎం.గోపా లరావు, శ్రీనివాసరెడ్డి, సాయిచంద్‌, పాల్గొన్నారు.
తాడేపల్లి రూరల్‌: రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని టిడిపి తాడేపల్లి మండల అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్‌ కోరారు. ప్రాతూరు గుండిమెడలో దెబ్బతిన్న వరి పొలాలను ఆయన టిడిపి శ్రేణులతో కలిసి పరిశీలించారు. సీనియర్‌ నాయకులు అనుమోలు వీరాంజనేయప్రసాద్‌, చొక్కా ఫ్రాన్సిస్‌, పాటిబండ్ల నరసింహారావు, నాగార్జున, పఠాన్‌ జానీఖాన్‌ పాల్గొన్నారు.
పొన్నూరు :పొన్నూరు, వేమూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పొలాలను జనసేన సేవాదళ్‌ పూర్వపు అధ్యక్షుడు తన్నీరు కిషోర్‌ పరిశీలించారు. ఆయనవెంట చిరంజీవి, శ్రీనివాసరావు ఉన్నారు.