Sep 12,2021 13:07

మన సమాజంలో బాడీ షేమింగ్‌ చేయడం సాధారణంగా కనిపిస్తుంటుంది. రోజువారీ వ్యవహారాల్లో దానిని ఒక వినోదాంశంగా చూస్తారు. రంగు, ఎత్తు, రూపాలపై ఎవరో ఒకరు కామెంట్స్‌ చేస్తుండటం సహజం. స్నేహితుల మధ్య ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. వీటి కారణంగా ఆత్మవిశ్వాసం దెబ్బతిని, కుంగిపోయిన వాళ్లున్నారు. తేలికగా తీసుకున్నప్పటికీ ఆకర్షణీయంగా ఉండమనే భావన కొందరిని జీవితాంతం వెంటాడుతుంది. ఇలాంటి భావన తప్పని చెప్పాలనిపించింది. దీంతో అదే పాయింట్‌ను చెప్పాలని భావించా. క్రిష్‌ గారికి చెబితే కాన్సెప్ట్‌ బాగుందన్నారు. అలా ఈ సినిమా పట్టాలెక్కింది. ఇటీవల 'నూటొక్క జిల్లాల అందగాడు' విడుదలైన నేపథ్యంలో అవసరాల శ్రీనివాస్‌ పంచుకున్న విశేషాలు..

పేరు : శ్రీనివాస్‌ అవసరాల
పుట్టిన తేదీ : మార్చి 19, 1984
పుట్టిన ప్రాంతం : హైదరాబాద్‌
చదువు : మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్‌
తల్లిదండ్రులు : అవసరాలసత్యనారాయణ మూర్తి, నాగమణి
ఇష్టమైన నటుడు : రజనీకాంత్‌

     టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలతో నటుడిగా, సెన్సిబుల్‌ డైరెక్టర్‌గా, రైటర్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు అవసరాల శ్రీనివాస్‌. హీరోగా నటుడిగా, దర్శకుడిగా, రచయితా ఇలా మల్టీ టాలెంట్‌తో ఆకట్టుకుంటున్నాడు. నాని నటించిన 'అష్టాచమ్మా' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు శ్రీనివాస్‌. ఆ తర్వాత 'ఊహలు గుసగుసలాడే, అమీతుమీ' వంటి సినిమాల్లో నటించి, ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాలో ఆయన హీరోగా చేశారు. ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా తనదైన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులు ఎంజారు చేసేలా మంచి ఎంటర్‌టైనింగ్‌ కథతో వచ్చారు. ఈ సినిమా థియేటర్స్‌లో బాగానే సందడి చేస్తుంది.
     ఈ సినిమా గురించి అవసరాల శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బట్టతల విషయంలో కొంతమంది ఇబ్బంది పడటం నేను చూశాను.. అలా బాధపడవలసిన అవసరం లేదనే విషయాన్ని నేను కాస్త బలంగా చెప్పాలనుకున్నాను. ఈ సినిమా ద్వారా అదే చేశాను అన్నారు. అలాగే నటుడిగా.. రచయితగా.. దర్శకుడిగా పనిచేసిన నాకు రచన ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది.
    హిందీలో వచ్చిన 'బాల' చిత్రాన్ని ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. వాస్తవానికి ఆ సినిమా కంటే ముందే 2019 అక్టోబర్‌లోనే మా ప్రాజెక్ట్‌ మొదలుపెట్టాం. రెండు సినిమాల్లో చర్చించింది ఒకటే పాయింట్‌ కాబట్టి, ఆ సినిమా రిలీజ్‌ సమయంలోనే మాదీ విడుదల చేద్దామనుకున్నాం. కానీ కుదరలేదు. ఏప్రిల్‌లో అంతా సిద్ధమైన సమయానికి లాక్‌డౌన్‌ విధించారు. దాంతో విడుదల ఆలస్యమైంది. 'బాల' చిత్రాన్ని చూశాను. రెండు సినిమాల్లో అంతర్లీనంగా ఉండే అంశం ఒకటే అయినా కథ, కథనాలు మాత్రం పూర్తి భిన్నంగా అనిపిస్తాయి.
 

                                                       ఇమేజ్‌కు పరిమితమైపోను

    ఈ సినిమా వల్ల ప్రజల ఆలోచనా దృక్పథంలో ఏమైనా మార్పు వస్తే నటుడిగా సక్సెస్‌ అయినట్లేనని భావిస్తా. సినిమాలపరంగా ఏదో ఒక ఇమేజ్‌కు పరిమితమైపోవడం నాకు ఇష్టం లేదు. నటుడిగా నాలోని భిన్న కోణాల్ని ఆవిష్కరించాలని అనుకుంటున్నా. అందుకే నవ్యమైన కథల్ని ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నా. నటన, దర్శకత్వం కంటే రచననే నేను ఎక్కువగా ఇష్టపడతాను. అందులోనే సంతృప్తి దొరుకుతుంది. ఇక దర్శకుడిగా ఎమోషన్‌, కామెడీ కలబోసిన కథల్నే తీస్తాను. నేను రాసిన కథలకు ఇప్పటివరకు ఏ ప్రాబ్లమ్‌ రాలేదు. హింసాత్మక చిత్రాలు నాకు పెద్దగా నచ్చవు. ఇప్పట్నుంచి ఎక్కువగా రచన, దర్శకత్వంపైనే ఫోకస్‌ పెడదామని అనుకుంటున్నాను.