Apr 07,2021 09:53

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి మరోసారి దేశాన్ని వణికిస్తోంది. కేసుల సంఖ్యలో ఈ వైరస్‌ తన రికార్డులు అదే బద్దలు కొట్టుకుంటుంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,15,736 కేసులు నమోదయ్యాయంటే దేశంలో వైరస్‌ తీవ్రత స్థాయి చేతులు దాటినట్లే కనిపిస్తోంది. కరోనా మొదలైనప్పటి నుండి ఇదే అత్యధిక సంఖ్య. ఆరోగ్య శాఖ అధికారిక లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,28, 01,785 మంది. గడిచిన 24 గంటల్లో 630 మందిని ఈ మహమ్మారి బలితీసుకుంది. దీంతో ఇప్పటి వరకు 1,66,177 మంది కరోనాకు బలయ్యారు. దేశంలో యాక్టివ్‌ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,43,473. మంగళవారం 59,856 మంది డిశ్చార్జి అయ్యారు. అదేవిధంగా ఏప్రిల్‌ 6న దేశ వ్యాప్తంగా 39లక్షల డోసుల వ్యాక్సిన్లు వినియోగించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంఖ్యతో కలిపి ఇప్పటి వరకు వినియోగం అయిన డోసుల సంఖ్య 8,70, 77, 474. కాగా, 18 ఏళ్లకు పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ప్రధాని మోడీకి లేఖ రాసింది. అత్యంత కరోనా ప్రభావిత రాష్ట్రంగా మహారాష్ట్ర నిలువగా.... ఆ తర్వాతి స్థానాల్లో చత్తీస్‌గఢ్‌, ఢిల్లీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌ నిలుస్తున్నాయి.