Nov 22,2020 21:15

అమరావతి బ్యూరో: ఆయుష్‌ పారామెడికల్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆర్థిక శాఖలో గత 9 నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌ను క్లియర్‌ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని సిపిఎం రాష్ట్రకార్యదర్శి పి మధు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రంలో పిహెచ్‌సి/సిహెచ్‌సిలలో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పథకం కింద జిఒ నెం.73, 1774 ప్రకారం 2008, 2009లో రెండు విడతలగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 982 ఆయుష్‌ వైద్యశాలలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు వైద్య సేవలు అందించిన ఆయుష్‌ డిస్పెన్సరీలు గత టిడిపి ప్రభుత్వ హయాం(2017)లో మూతపడ్డాయి. మూతపడ్డ 456 డిస్పెన్సరీలను వెంటనే తెరిపించి వాటిలో ఆయుష్‌ వైద్యులను నియమించి తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు దీర్ఘకాలిక రోగాలకు ముఖ్యంగా కరోనా, స్వైన్‌ఫ్లూ, చికెన్‌ గున్యా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వాధి నివారణకు చర్యలు చేపట్టాలని మధు కోరారు. ముందస్తుగా అవసరమైన భారతీయ సాంప్రదాయ ఆయుర్వేద, హోమియో, యోగా, నేచురోపతి వైద్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, రోడ్డునపడ్డ 700 మంది ఆయుష్‌ పారామెడికల్‌ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా న్యాయం జరగలేదని తెలిపారు. ఆర్థిక శాఖలో గత 9 నెలలుగా వీరికి సంబంధించిన ఫైల్‌ నెం.1116736 పెండింగ్‌లో ఉందని, దీనిని వెంటనే క్లియర్‌ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. ఫైల్‌ క్లియర్‌ చేయడం ఆలస్యం అవుతున్నందున కొంతమంది ఆయుష్‌ ఉద్యోగులకు ఏ ఉద్యోగానికి అర్హత లేకుండా పోనుందని ఆందోళన వ్యక్తం చేశారు. కావున ఆయుష్‌ పారామెడికల్‌ ఉద్యోగుల సమస్యను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.