May 16,2021 11:28

ఇంపాల్‌ : 'ఆవు పేడ, గో మూత్రం కరోనాను అంతం చేయవు' అని సోషల్‌ మీడియా పోస్టుపెట్టినందుకు జర్నలిస్ట్‌తో పాటు రాజకీయ సామాజికవేత్తను మణిపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సైఖోమ్‌ తికేంద్ర సింగ్‌ కరోనాతో చనిపోయారు. అయితే మణిపూర్‌కు చెంది జర్నలిస్ట్‌ కిషోర్‌చంత్ర వాంగ్‌ఖేమ్‌, రాజకీయ సామాజివేత్త ఎరేండ్రో లీచోంబంలు సోషల్‌ మీడియాలో ' ఆవు పేడ, గో మూత్రం కరోనాను అంతం చేయవు' అని ఎద్దేవా చేశారని ఆరోపిస్తూ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు ఉషం దెబన్‌, ప్రధాన కార్యదర్శి పి. ప్రేమానంద మీటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కిషోర్‌, ఎరేండ్రో నివాసాల వద్ద వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. మే 17 వరకు వారిని పోలీస్‌ కస్టడీకి తరలించారు. కాగా, జర్నలిస్ట్‌ కిషోర్‌ను సోషల్‌ మీడియా పోస్టుకు సంబంధించిన కేసుల్లో గతంలో రెండుసార్లు అరెస్టు చేశారు. ఆయనపై జాతీయ భద్రత చట్టం (ఎన్‌ఎస్‌ఎ) కింద దేశ ద్రోహం కేసును బిజెపి పాలిత రాష్ట్రం నమోదు చేసింది.