Jan 15,2022 08:45

ప్రజాశక్తి - యంత్రాంగం : ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురుస్తోన్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మిర్చి, ధాన్యం కళ్లాలోనే ఉండటంతో వాటికి కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టార్ఫలిన్‌ పట్టాలను కప్పిన కొన్ని చోట్ల పంట తడిచిపోయింది. కృష్ణా జిల్లా నందిగామ, వీరులపాడు, కంచికచర్ల మండలాల్లో కళ్లాల్లోని మిర్చి పంట తడవకుండా ఉండేందుకు రైతులు రూ. రెండు వేల నుంచి మూడు వేలు వెచ్చించి టార్ఫలిన్‌ పట్టాలు కప్పిన ప్రయోజనం లేదు. తడిస్తే రంగు మారి నష్టపోయే ప్రమాదం ఉందని పలువురి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండలంలో వీచిన భారీ గాలులకు సుమారు 50 ఎకరాల్లో అరటి తోటలు, మరో 50 ఎకరాల్లో మొక్కజొన్న నేలమట్టమయ్యాయి.సీతానగరం మండలంలో కుప్పలుగా ఉన్న (గాలిదిబ్బలు)వరిచేలు నీటమునిగాయి. వడగళ్ల వానతో పాటు భారీ గాలులకు మామిడిపల్లి గ్రామం వద్ద రహదారిపై చెట్లు నేలకొరగడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
    ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో శనగ, పొగాకు, కొత్తిమీర పంటలు నీటమునిగాయి. గత నెలలో కురిసిన అధిక వర్షానికి మిర్చి, మినుము పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 10 శాతం రైతులు తిరిగి పంటను సాగు చేశారు. గతరెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు ఆ పంటలు కూడా దెబ్బతిన్నాయి. మిర్చి సాగుకు ఎకరానికి లక్ష పైగా ఖర్చు చేశామని, రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. కూరగాయల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా టమోటా రైతులు అధికంగా నష్టపోయారు.
 

                                                           48 గంటల్లో భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తాలోని ఒకటి రెండు చోట్లా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలుచోట్ల తేలిక పాటి వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.