Mar 01,2021 20:59

పారిస్‌ : ఒక అవినీతి కేసులో ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు నికొలస్‌ సర్కోజిని పారిస్‌ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఏడాది శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఫ్రాన్స్‌కు 2007 నుండి 2012 వరకు అధ్యక్షుడిగా వున్న సర్కోజి సీనియర్‌ మేజిస్ట్రేట్‌ నుండి అక్రమంగా సమాచారం సేకరించే ప్రయత్నం చేసినందుకు కోర్టు ఆయన్ని దోషిగా నిర్ధారించింది. ఎలక్ట్రానిక్‌ బ్రేస్‌లెట్‌ పెట్టుకుని సర్కోజి తన నివాసానికే పరిమితం కావాలని కోర్టు ఆదేశించింది. ఒక మేజిస్ట్రేట్‌కు సాయపడేందుకు తన పదవిని ఉపయోగించుకున్న మాజీ అధ్యక్షుడు నేరానికి పాల్పడ్డారని, ఇందులో తీవ్రమైన వాస్తవాలు వున్నాయని కోర్టు పేర్కొంది. సర్కోజితో పాటు వున్న మరో ఇద్దరిని కూడా దోషిగా నిర్ధారించిన కోర్టు వారికి కూడా ఇదే శిక్షను విధించింది. ఈ నెల్లో మరో కేసులో సర్కోజీ విచారణను ఎదుర్కొనాల్సి వుంది. 2012 అధ్యక్ష ఎన్నికల్లో అక్రమంగా నిధులు సమకూర్చారన్న ఆరోపణలపై మరో 13తోపాటు సర్కోజీ కూడా విచారణకు సిద్దమయ్యారు.