Jun 13,2021 08:24
  • ఇంజెక్షన్‌ ధర రూ.16 కోట్లు
  • రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ వైద్యుల వెల్లడి

ప్రజాశక్తి - బిజినెస్‌ బ్యూరో : పిల్లలకు వైద్య సేవలందించే ప్రముఖ రెయిన్‌ బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో గడిచిన 10 మాసాల్లో వరుసగా మూడో సారి విజయవంతంగా అత్యంత అరుదైన స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రోఫీ (ఎస్‌ఎంఎ) వ్యాధికి చికిత్సను అందించింది. ఈ వ్యాధితో బాధపడుతున్న మూడేళ్ల అయాన్డ్‌ గుప్తాను తల్లిదండ్రులు తమ సికింద్రాబాద్‌ హాస్పిటల్‌కు తీసుకొచ్చారని కన్సల్టెంట్‌ పెడియాట్రిక్‌ న్యూరాలజిస్టు డాక్టర్‌ రమేష్‌ కొనంకి తెలిపారు. జన్యు లోపం కారణంగా ఈ వ్యాధి వస్తోందన్నారు. దీని బారిన పడిన చిన్నారులలో నరాల బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మింగడమూ కష్టంగా మారుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో దాదాపు 800 మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతూ.. తమ రెండవ పుట్టిన రోజూ జరుపుకోకుండానే మరణిస్తున్నారన్నారు.
    అయాన్డ్‌ గుప్తా చికిత్స కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషదం జోల్గెన్‌స్మా అవసరం పడిందని డాక్టర్‌ రమేష్‌ తెలిపారు. బాలుడికి జూన్‌ 9న జొల్లెన్స్మా ఇంజెక్షన్‌ ఇచ్చామన్నారు. భారత్‌లో ఈ ఔషదం అందుబాటులో లేదన్నారు. అమెరికా నుంచి 2,125,000 డాలర్లు (రూ.16 కోట్లు) చెల్లించి దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. ఇంతక్రితం చికిత్స పొందిన ఇద్దరు చిన్నారులు కూడా ఆరోగ్యంగా ఉన్నారన్టి డాక్టర్‌ రమేష్‌ తెలిపారు. వైద్యానికి కావాల్సిన నిధులను తల్లిదండ్రులు 'ఇంపాక్ట్‌గురు డాట్‌ కామ్‌' క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా సమకూర్చుకున్నారని డాక్టర్‌ ప్రీతమ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఇంజెక్షన్‌ను దేశంలోనూ అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. 62,450 మంది దాతల నుంచి రూ.14.84 కోట్ల నిధులు సమీకరించి ఇచ్చామని ఇంపాక్ట్‌ గురు సహ వ్యస్థాపకులు పియూష్‌ జైన్‌ తెలిపారు.