
ప్రజాశక్తి - జమ్మలమడుగు అర్బన్
నరేంద్రమోదీ ప్రభుత్వంలో దేశంలో మహిళలకు రక్షణ కరువైందని డివైఎఫ్ఐ జమ్మలమడుగు పట్టణ నాయకుడు దివాకర్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లో దళిత అమ్మాయి మనీషాపై అత్యాచారానికి పాల్పడి ఘోరంగా చంపడాన్ని నిరసిస్తూ జమ్మలమడుగులో గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ నాయకులు దివాకర్ మాట్లాడుతూ మనీషాపై జరిగిన అత్యాచారానికి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాధ్ సర్కార్ సమాధానం చెప్పి తీరాలన్నారు. బిజెపి నాయకులు మహిళల పై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్న నోరు మెదపకపోవడం అన్యాయమని చెప్పారు.. 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆవుకు ఉన్న రక్షణ, భద్రత స్త్రీకి లేకపోవడం దారుణం, సిగ్గుచేటు అన్నారు. ఢిల్లీలో నిర్భయ సంఘటన కంటే ఘోరంగా ఉత్తరప్రదేశ్లోని మనీషా ఘటన చోటు చేసుకుందని అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎక్కువ దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. కేరళలో ఆవుకు ఏదో జరిగిందని గగ్గోలు పెట్టిన బిజెపి నాయకులు స్త్రీలపై అత్యాచారాలు జరుగుతుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మనీషా మతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా తల్లిదండ్రులను నిర్బంధించి ఖననం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. యోగి సర్కార్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పారు. మనీషా కుటుంబానికి న్యాయం జరగాలనీ, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజు, పాములేటి, బాషా, హుస్సేన్ వలి పాల్గొన్నారు.
ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్) : కేంద్రంలోని మోడీ సర్కార్లో గోవులకు ఉన్న రక్షణ ఈ దేశంలో మహిళలకు లేదని డివైఎఫ్ఐ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు విశ్వనాధ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్లో 19 సంవత్సరాల మనీషాపై జరిగిన అత్యాచార సంఘటనను నిరసిస్తూ తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విశ్వనాధ్ మాట్లాడుతూ దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. యోగి సర్కార్లోనే ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. మనీషా కుటుంబానికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో మింటు, శివ,కమల్ భాష వున్నారు.