Jan 25,2021 23:34

ప్రమాదానికి గురైన కూలీల ఆటో

ప్రజాశక్తి - నాదెండ్ల : ఆటో బోల్తాపడి కూలీలు గాయపడిన ఘటన మండలంలోని సాతులూరులో గుంటూరు -కర్నూలు రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కూలీలు కొద్దిరోజులుగా ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు మిర్చి కోతలకు వెళ్తున్నారు. సోమవారం పని ముగించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా గ్రామంలోని సినిమాహాల్‌ సొఎటర్‌ వద్దకు రాగానే ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఆటో బోల్తా పడింది. ఆటోలోని తాడిగిరి ఆదెమ్మ, అన్నలదాసు నాగమ్మ, మంజూష, నాగమ్మ, నిర్మల తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌ రాజు 108కు ఫోన్‌ చేయగా స్పందించకపోవడంతో ఆటోలోనే నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మద్యం దుకాణాలు ఉండడంతో నిత్యం వాహనాల రద్దీ ఉండడంతో పాటు ఎలాపడితే అలా నడిపిస్తున్నారని, దానికి తోడు రహదారి చిన్నది కావడంతో ప్రమాదం వాటిల్లిందని స్థానికులు చెబుతున్నారు.