Mar 02,2021 19:06

బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం ముఖ్యం అన్నదానికి వీరి వివాహమే ఒక నిదర్శనం. యాసిడ్‌ దాడిలో ఆమె ముఖం అంతా కాలిపోయింది. కంటి చూపు కోల్పోయింది. చీకటైందనుకున్న ఆమె జీవితాన్ని అర్థం చేసుకొని వెలుగు ఇచ్చాడు ఓ వైద్యుడు.

ఒడిశాలో జగత్సింగ్‌పూర్‌ జిల్లా, కనక్‌పూర్‌ గ్రామానికి చెందిన ప్రమోదిని స్థానిక కాలేజీలో ఇంటర్‌ చదువుతోంది. అప్పుడే ఆమెకు ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఏ కారణం చేతనో ఆ పెళ్లి సంబంధం కుదరలేదు. అతన్ని కాదన్నందుకు ఆమెపై కాలేజీలో యాసిడ్‌ దాడి చేశాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా జరగాల్సిన ప్రమాదం అప్పటికే జరిగిపోయింది. కంటి చూపు పోయింది. ముఖం 80 శాతం కాలిపోయింది. సుమారు 9 నెలలు ఐసియులో ఉంచారు. ప్రాణాలున్న శవంలా రోజులు గడిపింది ప్రమోదిని. మానసికంగా ఎంతో వేదనచెందింది. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి కటక్‌ లోని ఆసుపత్రిలో ఐదేళ్ళు ఉంచారు. యాసిడ్‌ దాడి చేసిన వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా సాక్ష్యాలు లేవని కేసు కొట్టేశారు.

నేనుంటానని...
యాసిడ్‌ ప్రమాదంలో గాయపడిన ప్రమోదినిని భువనేశ్వర్‌ బాలకటికి చెందిన ఆసుపత్రి వైద్యాధికారి సరోజ్‌ సాహూ పెళ్లి చేసుకున్నాడు. అతను ఎవరో కాదు. ఆమె ఆసుపత్రిలో ఉన్నప్పుడు దగ్గరుండి మరీ సేవలు చేశాడు. ఓ డాక్టర్‌గా ఆమెలో ఆత్మస్థైర్యం నింపేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. అలా వారి మధ్య ఏర్పడిన పరిచయమే ఇప్పుడు ఒక్కటయ్యేలా చేసింది. 2016లో వివాహ ప్రస్తావన తెచ్చినప్పుడు ప్రమోదిని మొదట ఒప్పుకోలేదు. తన పట్ల సాహు చూపిస్తుంది జాలి అనుకున్నది. అయితే ఆమె ఆరోగ్యం పట్ల అతను చూపిస్తున్న శ్రద్ధ అతనిపై నమ్మకాన్ని కలిగించింది.

ఒక అమ్మాయి ముఖానికి, వివాహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే సంప్రదాయ కుటుంబంలో పుట్టిన సాహూ ప్రమోదినిని వివాహం చేసుకునేందుకు- తన కుటుంబాన్ని ఒప్పించడానికి ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు. చివరికి అందర్నీ ఒప్పించాడు. 2018లో నిశ్చితార్థం చేసుకున్నా... 2021న మార్చి 1న పెళ్లితో ఒక్కటయ్యారు. ఆడపిల్లలపై యాసిడ్‌ దాడి చేస్తున్న మృగాలకు సాహు నిర్ణయం చెంపపెట్టు అంటూ ఈ జంటను పలువురు అభినందిస్తున్నారు.

ఆత్మవిశ్వాసం నింపిన పెళ్లి