Oct 12,2020 07:53

''మా అమ్మ ఒక్క విషయంలో సిద్ధహస్తురాలు
తను ప్రేమించే వాళ్లను
ప్రేమైక లోకంలో ఓలలాడిస్తుంది
తన మంద్రస్వరపు లాలిపాటతో
బుజ్జిబాబులను, చిట్టితల్లులను
గమ్మత్తుగా ఊరడిస్తోంది
ఆ కళాత్మక ప్రావీణ్యం గురించి
నేనేమాత్రం వివరించలేను !''
ఈ ఏడాది సాహిత్య నోబెల్‌ బహుమతి గెలుచుకున్న అమెరికన్‌ కవయిత్రి లూయిస్‌ గ్లక్‌ రాసిన చిట్టి కవిత ఇది. అల్లనల్లన పదాలతో, ఆత్మీయ భావనలతో సరళంగా పలికించే మనసు కవిత్వం ఆమెది. మానవ సంబంధాల్లోని చిన్ని చిన్ని ఆనందాలను, ప్రకృతిలోని సౌందర్య భావాలను పెనవేసి అల్లుకున్న కవిత్వ జడపాయలు ఆమెవి. గ్లక్‌ కవిత్వంలో ఆమె జీవితానుభవాలు ఎక్కువగా కనిపిస్తాయి అంటారు విమర్శకులు. కవిత్వ సృజనకు గానూ ఆమె ఇప్పటికే అనేక ప్రసిద్ధ సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. పులిట్జర్‌ పురస్కారం, అమెరికా నేషనల్‌ హ్యుమానిటీస్‌ పతకం, నేషనల్‌ బుక్‌ అవార్డు, బోలింగెన్‌ పురస్కారం వంటివి ఎన్నో ఆమె పొందారు.
లూయిస్‌ గ్లక్‌ 1943 ఏప్రిల్‌ 22న న్యూయార్క్‌ నగరంలో జన్మించారు. తండ్రి డేనియల్‌ గ్లౌక్‌ వ్యాపారవేత్త. తల్లి బీట్రైస్‌ గ్లక్‌ గృహిణి. వారి ఇద్దరు కుమార్తెల్లో లూయిస్‌ పెద్దది. గ్లౌక్‌ తల్లి రష్యన్‌. ఆమె తల్లితండ్రులు హంగేరియన్‌ యూదులు. వారు అమెరికాకు వలస వచ్చి, అక్కడే స్థిరపడ్డారు. లూయిస్‌ చిన్నప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడేది. తనలో తానే ఆలోచించుకుంటూ ఉండేది. కొన్నేళ్లపాటు మానసిక చికిత్స తీసుకొంది. తరచూ చావు గురించి ఆలోచించేది. చిన్న వయసులోనే కవిత్వం రాయడం ప్రారంభించింది. తల్లి వినిపించిన గ్రీకు పురాణ కథలు ఆమెకు చాలా ఇష్టం. ఇలాంటి బాల్యం వల్లనేమో లూయిన్‌ కవిత్వం నిండా వైయక్తిక భావాలూ, పురాణ కథా ప్రస్తావనలూ, ప్రకృతి ఆరాధన పుష్కలంగా కనిపిస్తాయి. సమాజంలో బయటికి కనపడే విషయాల కన్నా మనిషి లోలోపలి సంగతులే లూయిస్‌ని ఎక్కువ ప్రభావితం చేశాయి. అందుకే నోబెల్‌ సాహిత్య పురస్కార కమిటీ ఆమెను అజాత శత్రువు అని పేర్కొంది. ''వర్తమాన విషయాలను పట్టించుకొని కవులూ రచయితలూ సహజంగానే ఎవరితోనే విభేదించాల్సిన అవసరం ఉండదు. తమ వైయక్తిక కవిత్వంతో చాలామందికి ఇష్టులుగానే ఉంటారు. నోబెల్‌ బహుమతికి కూడా ఆమె అలాగే ఇష్టురాలైంది మరి!'' అని నర్మగర్భంగా ఆమె సామాజిక కవయిత్రి కాదని తేల్చిపడేసే విమర్శకులూ ఉన్నారు. వారి మాటలు కొట్టి పారేసేవి కాదు కూడా!
అనారోగ్యం, అనేక ఇతర ఆటంకాల మధ్య ఆమె చదువు సవ్యంగా సాగలేదు. 1961లో పట్టభద్రురాలైంది. 1963 నుంచి 1966 వరకూ కొలంబియా విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ జనరల్‌ స్టడీస్‌లో కవిత్వ వర్క్‌షాపుల్లో చేరారు. అక్కడ లియోనీ ఆడమ్స్‌, స్టాన్లీ కునిట్జ్‌ ... కవయిత్రిగా తన ఎదుగుదలకు ఎంతో దోహదపడ్డారని లూయిస్‌ చెబుతుంది. 1967లో ఆమె చార్లెస్‌ హెర్ట్‌ను వివాహం చేసుకుంది. కొద్దికాలంలోనే వారు విడిపోయారు. 1968లో గ్లక్‌ తన మొదటి కవితా సంకలనం ''ఫస్ట్‌బోర్న్‌'' విడుదలైంది. ఆ తరువాత వరసగా కవితా సంపుటులు వెలువరించింది. ఆమెది ఆత్మాశ్రయ కవిత్వం అని విమర్శకులు పేర్కొంటారు. యేల్‌, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఆమె ప్రస్తుతం అమెరికాలోని మసాచూసెట్స్‌లో నివసిస్తున్నారు. ఇప్పుడు ఆమె వయసు 77 ఏళ్లు.
- సుజరు సాహితి