Jul 27,2021 07:25

పిల్లల్లారా రారండోయ్
అందంగా పడవలు చేద్దాం
పారే నీటిలో వేసేద్దాం
రంగుల పతంగులు చేద్దాం
సరదాగా గాలిలో ఎగరేద్దాం

చెల్లెల్లారా రారండోయ్
ఒంటి కాలుతో ఎగురుదాం
తొక్కుడు బిళ్ళ ఆడేద్దాం
అందరం ఓచోట కూర్చుందాం
ఖర్చీఫ్‌ ఆటలు ఆడేద్దాం

అక్కల్లారా రారండోయ్
పంజాలు పక్కాగా వేద్దాం
అష్టా చెమ్మ ఆడేద్దాం
దోశెడు గింజలు తేరండి
వామన గుంటలు ఆడేద్దాం

తమ్ముల్లారా రారండోయ్
తాడు బొంగరం తేరండి
బొంగరాల ఆటలు ఆడేద్దాం
గుప్పెడు గోలీలు తేరండి
గోలీల ఆటలు ఆడేద్దాం

అన్నల్లారా రారండోయ్
కలసికట్టుగా జత కడుదాం
కబడ్డీ కబడ్డీ అని ఆడేద్దాం
తెలివిగా పావులు కదుపుదాం
చదరంగం ఆటలు ఆడేద్దాం

అమ్మమ్మల్లారా రారండోయ్
చకచకా నిచ్చెనలు ఎక్కుదాం
వైకుంఠపాళీ ఆటలు ఆడేద్దాం
కమ్మని పాటలు పాడండి
మంచి నిద్రను తెప్పించండి

తాతయ్యల్లారా రారండోయ్
నీతి కథలు చెప్పండి
మమ్మల్ని ఎత్తుకొని తిప్పండి
చక్కని కబుర్లు చెప్పండి
మమ్మల్ని మీ వీపుపై ఎక్కించి
ఆడించండి ...

- బోనగిరి పాండు రంగ